ఈరోజుల్లో ఆంజనేయస్వామిని ఆరాధిస్తే ఇక అన్ని జయాలే !
ఆంజనేయస్వామి.. కలియుగంలో శ్రీఘ్రంగా భక్తులను అనుగ్రహించే దేవతలలో ఆంజనేయస్వామి ఒకరు. ఆయన సులభంగా భక్తుల కోరికలను తీరుస్తాడు. అయితే ఆయన ఆరాధనకు పెద్దలు కొన్ని పర్వదినాలను అంటే పవిత్రమైనవాటిని పేర్కొన్నారు. ఆయా మాసాలలో ఆయా నక్షత్రాలలో ఆంజనేయస్వామి ఆరాధన చేస్తే శ్రీఘ్రంగా కోరికలు నెరవేరుతాయని పండితుల ఉవాచ. అవి ఏమిటో తెలుసుకుందాం….
మాసాల ప్రకారం చూస్తే.. చైత్రమాసం- పుష్యమీ నక్షత్రం, వైశాఖమాసం – ఆశ్లేషా నక్షత్రం, వైశాఖమాసం- కృష్ణపక్ష దశమీ హనుమజ్జయంతి, జ్యేష్ఠమాసం- మఖా నక్షత్రం, జ్యేష్ఠశుద్ధ -విదియ, దశమి, ఆషాఢ మాసం – రోహిణి నక్షత్రం, శ్రావణ మాసం – పూర్ణిమ, భాద్రపద మాసం – అశ్వనీ నక్షత్రం, ఆశ్వీయుజ మాసం – మృగశీర్షా నక్షత్రం, కార్తీక మాసం – ద్వాదశి, మార్గశీర్ష మాసం – శుద్ధ త్రయోదశి, పుష్య మాసం – ఉత్తరా నక్షత్రం, మాఘ మాసం – ఆర్ధ్రా నక్షత్రం, ఫాల్గుణ మాసం – పునర్వసు నక్షత్రం.
ఇక వీటితోపాటు మరికొన్ని రోజులు ఆయా నక్షత్రాలతో ఆయా వారాలు వచ్చిన విశేష దినాలుగా పండితులు పేర్కొన్నారు అవి వరుసగా… హస్త, మృగశీర్షా నక్షత్రములతో కూడిన ఆదివారములు స్వామి వారికి ప్రీతిదాయకములు. పూర్వాభద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. అదియును పర్వదినము. ప్రతి శనివారము స్వామివారికి పూజలు చేయుట విధి. అమావాస్యతో కూడిన సోమవారము, ప్రతి మంగ ళవారం స్వామి వారి పూజకు ప్రీతి దినములు.
వైధృతియోగయు నందు (అనగా ఉత్తమము, అపూర్వము అగు గ్రహయోగ కాలం, విష్కం భాది 27 యోగాలలో చివరిది వైధృతి యోగము) స్వామిని పూజించిన విశిష్ట ఫలసిద్ధి కలుగును. అదేవిధంగా స్వామికి మంగళవారం, శనివారం నాడు వడమాల, తమలపాకులతో పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి. అదేవిధంగా స్వామికి సింధూరధారణ చేసిన కూడా శుభం కలుగుతుంది.