srisailam : శ్రీశైలం జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందో మీకు తెలుసా ?
srisailam : శ్రీశైల క్షేత్రం అంటె తెలియని తెలుగు వారు ఉండరు. ద్వాదశ జ్యోతిర్లింగంగా, అష్ఠాదశ శక్తిపీఠంగా భాసిలుతున్న ఈ పరమ క్షేత్రం ఎలా ఏర్పండింది? దీని వెనుక పురాణగాథను శివరాత్రి ఉత్సవాల ప్రారంభమైన వేళ తెలుసుకుందాం… ఒకనోక సందర్భంలో శివపార్వతుల పుత్రుడు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదలి, క్రౌంచపర్వతానికి చేరుకోగా, కుమారుని వదలిఉండలేని పార్వతీపరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం. అందుకే ‘శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండద’ని అంటారు. అలాగే పర్వతుడనే ఋషి తపఃఫలంగా పరమశివుడు ఇక్కడ లింగపూరమ్లో ఆవిర్భవించాడని మరోకథనం ప్రచారంలో ఉంది.
‘‘ కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దారుణాచలే
దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే’’
కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అరణ్యవాసం అనతరం పాండవులు, శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామివారిని దర్శించుకున్నట్లు పురాణకథనం. సీతారాములు రామ సహస్రలింగం, సీతా సహస్రలింగాలను ప్రతిష్టించినట్లు ప్రసిద్ధి. ఈ కలియుగంలో ఆదిశంకరాచార్య, ఆచార్య నాగార్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రప్రతి శివాజీ వంటివారెందరో స్వామిని దర్శించుకుని స్వామిని అమ్మవారిని ఆరాధించినట్టు అనేక శాసనాల ద్వారా చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
ఇక్కడ నేటికి రుషులు, మునులు, సాధువులు స్వామి కోసం తపస్సు ఆచరిస్తుంటారని పెద్దలు చెప్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో ఈ క్షేత్రం ఉంది. అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యం ఉంది. ఈ క్షేత్రం పక్కనుంచి కృష్ణవేణీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ కృష్ణానదిని పాతాళగంగగా అభివర్ణిస్తారు. ఇక్కడ కృష్ణా నదిపై బహుళార్థక సాధక ప్రాజెక్టును నిర్మించారు.