Karthika Masam : కార్తీక శుక్రవారం రోజున ఇలా చేశారంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది!
Karthika Masam : అన్ని మాసాలలో కార్తీకమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే కార్తీకమాసంలో వచ్చే శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సంవత్సరం ఈ పవిత్రమైన రోజున కార్తీక శుక్రవారం రోజునే దేవ ప్రబోధిని ఏకాదశి రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తిధి రోజే శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మెలకువలోకి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కార్తీక శుక్రవారం రోజున విష్ణువుతోపాటు లక్ష్మీదేవి, పార్వతి దేవిలను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే సిరిసంపదలు కూడా పెరుగుతాయి. కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం. అందుకే కార్తిక శుక్రవారం పూట కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. అలా చేయడం వలన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
కార్తీక శుక్రవారం పూట సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఉతికిన బట్టలను ధరించాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉన్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఉపవాసం ఉన్నవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన రెండు పూటలు పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరితో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కార్తీక శుక్రవారం రోజున స్త్రీలు తెలుపు రంగులో ఉండే పూలను కనకాంబరాలను గాని ధరించి లక్ష్మీదేవి, పార్వతి దేవిలను పూజిస్తే దీర్ఘసుమంగళిగా జీవిస్తారు. ఇదే రోజున సాయంత్రం అంటే సంధ్యా వేళలో ఇంట్లో దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవిని మన ఇంటికి పిలిచినట్లే. ధనలక్ష్మి ఇంట్లోకి వచ్చి నివాసం ఉంటుందని చాలా మంది నమ్మకం.
కార్తీక శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఎదుట దీపారాధన చేస్తే సిరిసంపదలు పెరుగుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి చెట్టు ముందు దీపాలను వెలిగించాలి. అన్ని దీపాలను మట్టితో తయారు చేసినవే అయి ఉండాలి. అలాగే ప్రమిదలలో నెయ్యి వేసి దీపాలను వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎవరి ఇంటి ముందు అయితే శుక్రవారం పూట సంధ్యా వేళలో దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుందని చాలామంది నమ్ముతున్నారు. ఇదే రోజున లక్ష్మీదేవి పార్వతి దేవి దేవాలయాలకు వెళ్లి దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది. అమ్మవారికి మల్లెపూలు లేదా పూలమాలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి జ్యోతిష్యులు చెబుతున్నారు.