తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడికి మొదటి నైవేద్యం అందులోనే పెట్ట‌డం వెనుక ర‌హ‌స్యం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడికి మొదటి నైవేద్యం అందులోనే పెట్ట‌డం వెనుక ర‌హ‌స్యం..?

 Authored By keshava | The Telugu News | Updated on :18 April 2021,7:41 pm

తిరుమల.. శ్రీవేంకటేశ్వరస్వామి, కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన క్షేత్రంగా, ఆదాయం వచ్చే క్షేత్రంగా ఖ్యాతిగడించింది. అయితే నిజంగా శ్రీవేంకటేశ్వరుడు కేవలం ధనవంతుల దేవుడేనా? అనిపిస్తుంది. అయితే దీనివెనుక కథను నేటికి నిత్యం తిరుమలలో జరిగే విశేషాలను తెలుసుకుందాం.. తిరుమల ఆలయం నిర్మించిన తొండమాన్‌ చక్రవర్తి …స్వామికి నిత్యం బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – “స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి?” అన్నాడుట. స్వామి తొండమానుడుకి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాడు. అతని పేరు భీముడు. ఒక కుమ్మరివాడు వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట.

వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి క‌ల‌వాలి

అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, “ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం” అని.భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు. అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు  వాటి వల్ల నా సంసారం సాగుతోంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట.

lord venkateswara swamy Naivedyam secrets

lord venkateswara swamy Naivedyam secrets

ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి” అనేవాడుట? అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,వీడేమో అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు, నేనేమో నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను. ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం. భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానంలోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారట.

అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్ని భీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు. నేటికి తిరుమలలో ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. స్వామి ప్రధాన గర్భగుడిలో పెట్టే మొదటి నైవేద్యం కుండపెంకులోనే. స్వామి తనను ఆరాధించిన వాడికి సొంతం. భక్తికి ఆయన పరవశుడైపోతాడు. అంతేకానీ ధనం ఇస్తే కోట్లాది రూపాయలకు, వజ్రవైఢూర్యాలకు లొండడు అనేది తెలుసుకోవాలి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది