2020లో మరో విషాదం.. ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి
విలన్, కమెడియన్, విలక్షణ నటుడు నర్సింగ్ యాదవ్ (52) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. 2020లో ఇప్పటికే ఎంతో మంది తారలు నింగికెగిశారు. ఇక ఈ ఏడాడి ముగుస్తోంది.. ఇకపై ఎలాంటి చెడు వార్తలు వినమని అనుకుంటున్న తరుణంలో ఇలాంటి మరో దుర్ఘటన జరిగింది.
ఈ ఏడాదిలో ఎంతో మంది సినీ ప్రముఖులు మరణించారు. బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీలో ప్రముఖులు స్వర్గస్తులయ్యారు. కొందరు కరోనా బారిన పడితే.. మరికొందరు ఆరోగ్యం సహకరించక మరణించారు. టాలీవుడ్‌లో ముఖ్యంగా ఎస్పీబీ, జయ ప్రకాష్ రెడ్డి వంటి వారు మరణించారు. ఇక ఈ ఏడాది ముగిసేందుకు ఎంతో సమయం లేదు.. అన్ని శుభవార్తలే వింటాం.. విందామనే ఆశతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేందుకు చిత్రసీమ రెడీ అయింది.
కానీ అకస్మాత్తుగా ఇలా నర్సింగ్ యాదవ్ మరణించాడనే వార్త అందరినీ కుదిపేస్తోంది. పలు సినిమాల్లో కామెడీ, విలన్ పాత్రల్లో నర్సింగ్ నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 300 చిత్రాల్లో ఆయన నటించారు. హేమాహేమీలు చిత్రంలో నర్సింగ్ సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం నటుడిగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆయనకు బ్రేక్ ఇచ్చారు. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ‘క్షణక్షణం’లో నర్సింగ్ నటించారు.