Divya Bharti : అతి చిన్న వయసులోనే దివ్య భారతి ఎలా చనిపోయింది? తన మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి?
Divya Bharti : అతిలోకసుందరి శ్రీదేవి తర్వాత అంతటి అందం దివ్య భారతి సొంతం. 14 ఏళ్ల వయసులోనే తనకు సినిమా అవకాశాలు వచ్చాయి. 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా వరుస విజయాలతో రోజుకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకుంటూ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా దివ్య భారతి నిలిచింది. తన సినీ కెరీర్ ను 16 వ ఏట మొదలు పెట్టి తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న రోజుల్లో తన 19 వ ఏటనే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయింది దివ్య భారతి. మరి.. దివ్య భారతి చనిపోయిన రోజు ఏం జరిగింది? తను సూసైడ్ చేసుకుందా? ప్రమాదవశాత్తు మరణించిందా? తన చావు వెనుక ఎవరి హస్తం అయినా ఉందా అనే విషయాలను తెలుసుకుందాం. ఓం ప్రకాశ్, మీటా భారతి దంపతులకు ముంబైలో 1974, ఫిబ్రవరి 25 వ తేదీన దివ్య భారతి జన్మించింది. ఓం ప్రకాశ్ కు మీటా భారతి రెండో భార్య. దివ్య భారతికి హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషలు స్పష్టంగా వస్తాయి.
ముంబైలోని మకెంజి కూపర్ హైస్కూల్ లో దివ్య భారతి చదువుతుండగా చాలా చిన్నవయసులోనే నందు తులానీ అనే డైరెక్టర్ తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని దివ్య భారతి పేరెంట్స్ ను అడిగాడు. కానీ.. తన వయసు చిన్నది కావడంతో ఆ ఆఫర్ ను వాళ్లు తిరస్కరించారు. ఆ తర్వాత కొంత కాలానికి అమీర్ ఖాన్, గోవిందా తమ్ముడు నటించబోయే కొన్ని సినిమాలకు వరుసగా నటించేందుకు ఒప్పుకుంటూ ఆ ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది. కానీ తనకు వచ్చిన అవకాశాలు నిరాశను మిగుల్చాయి. తన ప్లేస్ లో వేరే వాళ్లను ఆ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకున్నారు. అదే సమయంలో డాక్టర్. రామానాయుడు తన తదుపరి సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం వెతుకుతుండగా దివ్య భారతిని చూసి తనను సంప్రదించారు. దీంతో తన మొదటి సినిమా తెలుగులోనే నటించింది. అదే బొబ్బిలి రాజా సినిమా.
ఆ సమయంలో తన వయసు 16 ఏళ్లు మాత్రమే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తనకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. చిట్టెమ్మ మొగుడు, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మక్షేత్రం అన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో దివ్య భారతి సౌత్ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది. అయినప్పటికీ తను బాలీవుడ్ లోనూ రాణించాలని అనుకుంది దివ్య భారతి. అందుకే తెలుగు ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్ కు వెళ్లి విశ్వాత్మ అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. 1992 విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఒక్కసారిగా తనకు బాలీవుడ్ లో వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. ఒకేసారి 14 సినిమాలకు సైన్ చేసింది దివ్య భారతి. అప్పట్లో బాలీవుడ్ రోజుకు లక్ష రూపాయలు శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి వాళ్లే తీసుకునే వారు. రోజుకు లక్ష తీసుకునే వాళ్లలో దివ్య భారతి కూడా చేరి టాప్ 3 పొజిషన్ ను కొట్టేసింది. కట్ చేస్తే దివ్య భారతికి బాలీవుడ్ లో నటిస్తున్న సమయంలోనే సాజిద్ నదియావాలా పరిచయం అయ్యాడు. అలా వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. దివ్య భారతి తన కెరీర్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా సాజిద్ ను రహస్యంగా పెళ్లి చేసుకొని తన మతం కూడా మార్చేసుకుంది.
తన పేరును సనగా మార్చుకుంది. ఇక.. 1993, ఏప్రిల్ 5న ఆమె షూటింగ్ పూర్తి చేసుకొని తన తమ్ముడు కునాల్ తో కలిసి ముంబైలో తను సాజిద్ తో కలిసి ఉంటున్న అపార్ట్ మెంట్ కు వెళ్లింది. తన కాలికి గాయం అయిందని హైదరాబాద్ లో పాల్గొనాల్సిన షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుంది దివ్య భారతి. అపార్ట్ మెంట్ కు వెళ్లిన తర్వాత కునాల్, సాజిద్ ఇద్దరూ బయటికి వెళ్లిపోయారు. ఇంతలో క్యాస్టూమ్ డిజైనర్ నీతులాను అర్జెంట్ గా తన ఇంటికి రమ్మని కాల్ చేస్తుంది. ఆ రోజు రాత్రి డిజైనర్ నీతులాతో పాటు ఆమె భర్త శ్యామ్ కూడా దివ్య భారతి ఇంటికి వస్తాడు. కాసేపు డిజైన్ గురించి మాట్లాడుకున్న తర్వాత నీతులా, శ్యామ్ టీవీలో ప్రోగ్రామ్ చూస్తుండగా దివ్య భారతి కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్తుంది దివ్య భారతి. ఇంతలో పెద్ద శబ్దం వస్తుంది. ఏం జరిగిందో తెలియదు.. తన అపార్ట్ మెంట్ లోని 5 వ అంతస్తు నుంచి దివ్య భారతి కింద పడిపోతుంది. వెంటనే ఇంట్లో ఉన్న నీతులా, శ్యామ్ అంబులెన్స్ కు కాల్ చేసి దివ్య భారతిని ఆసుపత్రికి తరలిస్తారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న దివ్య భారతి మరణించింది. ఒక్కసారిగా వార్త తెలిసిన జనాలంతా షాక్ కు గురయ్యారు. ఇలా దివ్య భారతి మరణించింది అని తెలియగానే తన మరణం వెనుక ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి.