Jr NTR : ఎన్టీఆర్ సినిమాలు ఆపడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపినట్టే అవుతుంది – రోజా
RK Roja Reacts to Jr NTR & TDP MLA Prasad Controversy : అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.కె.రోజా దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పట్ల టీడీపీకి మొదటి నుంచీ చిన్నచూపేనని ఆమె విమర్శించారు.
roja react ntr movies
జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం అంటే అరచేతితో సూర్యుడిని అడ్డుకున్నట్టేనని రోజా వ్యాఖ్యానించారు. ఈవీఎంలు మార్చి ప్రజలను మోసం చేసినంత సులభంగా సినిమాలు ఆడకుండా అడ్డుకోలేరని ఆమె ఎద్దేవా చేశారు. సినిమా బాగుంటే తప్పకుండా సక్సెస్ అవుతుందని, బాగా లేని సినిమాను ఎవరూ ఆడించలేరని రోజా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా గురించి ప్రస్తావించారు. టీడీపీ-జనసేన ఎమ్మెల్యేలు టికెట్లు ఉచితంగా ఇచ్చినా కూడా ఆ సినిమాను ఎవరూ చూడలేదని, ఎంత ప్రయత్నించినా అది ఆడలేదని రోజా గుర్తు చేశారు. స్వయంగా పవన్ అభిమానులే ఆ సినిమాను చూడటానికి థియేటర్లకు రాలేదని ఆమె పేర్కొన్నారు.
రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, సినిమాలను సినిమాలుగానే చూడాలని రోజా హితవు పలికారు. సినిమాలు, రాజకీయాలను కలపడం మంచిది కాదని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఆయన సినిమాలు దేశ విదేశాల్లో ఎంత విజయం సాధిస్తున్నాయో, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంటున్నాయో మనం చూస్తున్నామని ఆమె అన్నారు. అలాంటి హీరో సినిమాలను ఆపాలని ప్రయత్నిస్తే జనం నవ్వుతారని రోజా వ్యాఖ్యానించారు. గతంలో సినిమా ఫంక్షన్లలో వైఎస్ జగన్‌ను విమర్శించినప్పుడు ‘గేమ్ ఛేంజర్’, ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాలు ఏమయ్యాయో మనం చూశామని గుర్తు చేశారు.