RRR Movie : ఆర్ఆర్ఆర్ తెలుగు ప్రేక్షకులకు గర్వం మరియు భారం.. ఇదెక్కడి న్యాయం?
RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న భారీ ఎత్తున ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు చూసేందుకు భారంగా మారింది. ఎందుకంటే ఈ సినిమా టికెట్ల రేట్లను అమాంతం పెంచేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే పెంచిన టికెట్ల రేట్లకు అదనంగా మరో వంద రూపాయలు పెంచుకునే అవకాశాన్ని రాజమౌళి టీంకి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇస్తూ అధికారికంగా జీవో ని కూడా విడుదల చేయడం జరిగింది.
ఈ నిర్ణయంపై తెలుగు ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ జక్కన్న సినిమా అంటే కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు గర్వించ దగ్గ సినిమా అనడం లో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమా తెలుగు సినిమా అయినందుకు బాలీవుడ్ ముందు తల ఎత్తుకొని మరి ఇది మా సినిమా అని చెప్పుకునే రేంజ్ లో తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను హిట్ చేశారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా కచ్చితంగా అంతకు మించి ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే ఆ సినిమా కు భారీగా పెట్టిన టికెట్ల రేట్లు మాత్రం చాలా భారంగా మారాయి.

RRR Movie tickets rates in telugu states
ఒకవైపు సినిమాను చూసి గర్వం తో తల ఎత్తుకునే విధంగా ఉంది. మరో వైపు టికెట్ల భారం మోయలేక బాబోయ్ అన్నట్లుగా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. సినిమా కొన్ని రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్ఫారంపై వస్తది కదా థియేటర్లలో చూడకుండా ఉందాం అనుకునే దానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా చూడాలనే ఆసక్తి ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే మూడు నాలుగు వేల రూపాయల ఖర్చు అయ్యే పరిస్థితి. మన తెలుగు ప్రేక్షకులు అంతా గర్వించ దగ్గ సినిమా కనుక చూడాల్సిందే అంటూ కొందరు ముక్కుతూ మూలుగుతూ సినిమా కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా చేయడం రాజమౌళికి ఏమాత్రం భావ్యం కాదని కొందరు సినీ ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.