IPL 2026 : బెట్టింగ్ ఊబిలో పడొద్దు .. బతుకును ఛిద్రం చేసుకోవద్దు .. సజ్జనార్ హెచ్చరిక ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :28 March 2026,2:00 pm

ప్రధానాంశాలు:

  •  IPL 2026 : బెట్టింగ్ ఊబిలో పడొద్దు .. బతుకును ఛిద్రం చేసుకోవద్దు .. సజ్జనార్ హెచ్చరిక ..!

IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. క్రికెట్ పట్ల ప్రేమను క్రీడాస్ఫూర్తితో ప్రదర్శించాలని కానీ బెట్టింగ్ వంటి ప్రమాదకర మార్గాలకు దూరంగా ఉండాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇటీవల కొందరు క్రికెట్ క్రేజ్‌ను ఉపయోగించుకుని యువతను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్నారని ఇది మొదట చిన్న వినోదంలా కనిపించినా చివరకు జీవితాలను నాశనం చేసే స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్ అనేది సులభంగా డబ్బు సంపాదించే మార్గంలా కనిపించినా అది పూర్తిగా భ్రమ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలకు ఆకర్షితులవుతున్న యువత తమ చేతిలో ఉన్న డబ్బును కోల్పోవడమే కాకుండా, అప్పుల బారిన పడుతున్నారని తెలిపారు.

VC Sajjanar key suggestions on the start of IPL 2026

VC Sajjanar key suggestions on the start of IPL 2026

ఈ పరిస్థితి కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తుందని కొన్నిసార్లు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు కూడా వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి అలవాట్ల వల్ల వ్యక్తిగతంగా మాత్రమే కాదు కుటుంబ పరంగా కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తండ్రి కష్టార్జిత సంపాదన తల్లి నగలను తాకట్టు పెట్టి బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు. గౌరవప్రదమైన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న దుస్థితిని కూడా ఆయన ప్రస్తావించారు. బెట్టింగ్‌లో నష్టపోయిన తరువాత అప్పులు తీర్చలేక కొందరు యువకులు ఆత్మహత్యల వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మరికొందరు అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, మోసాలకు పాల్పడి తమ భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారని ఆయన హెచ్చరించారు. అందువల్ల ఐపీఎల్ వంటి టోర్నమెంట్లు కేవలం వినోదం కోసం మాత్రమేనని గెలుపోటములను సహజంగా తీసుకుని క్రీడను ఆస్వాదించాలని సూచించారు.

ప్రత్యేకంగా విద్యార్థులు, యువత తమ చదువు, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా అనేక యాప్‌లను నిషేధించినప్పటికీ ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా బెట్టింగ్ కొత్త రూపం దాల్చిందని తెలిపారు. ఇటువంటి యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్‌లైన్‌తో పాటు ఫామ్‌హౌస్‌లు, రహస్య ప్రదేశాల్లో జరుగుతున్న ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 9490616555 నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి