Hyderabad..మరో ఇద్దరు నేతలకు వైట్ చాలెంజ్.. వారైనా స్వీకరించేనా?
గ్రీన్ చాలెంజ్ తరహాలోనే వైట్ చాలెంజ్ స్వీకరించి డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని నామినేట్ చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వారు ఇరువురు హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్దకు రావాలని కోరారు. అయితే, మంత్రి కేటీఆర్ ఈ విషయమై డిఫరెంట్‌గా స్పందించారు. చాలెంజ్ స్వీకరించకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు మంత్రి కేటీఆర్. కాగా, సోమవారం గన్‌పార్క్ వద్దకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైట్ చాలెంజ్ సమాజానికి అవసరమైన చాలెంజ్ అని చెప్పారు. రేవంత్ చాలెంజ్‌ను మంత్రి కేటీఆర్ స్వీకరించి ఉంటే కనుక ఆయన స్థాయి పెరిగేదని అభిప్రాయపడ్డారు. సింగరేణి ఘటన డ్రగ్స్ వల్లే జరిగిందన్నారు.
ఎన్నికల్లో నిలబడే ప్రతీ ఒక్కరు వైట్ చాలెంజ్ స్వీకరించి టెస్టులు చేయించుకోవాలన్నారు. ఇకపోతే ఈ డ్రగ్స్ టెస్టుల లొల్లిలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధం లేదని, కేటీఆర్ రాహుల్ గాంధీ గురించి తొందరపడి మాట్లాడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే కొండా వైట్ చాలెంజ్‌కు మరో ఇద్దరు నేతలను నామినేట్ చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్, ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ వైట్ చాలెంజ్ స్వీకరించి యువతకు ఆదర్శంగా నిలవాలని కొండా సవాల్ విసిరారు.