MLA Raja Singh : ఎమ్మెల్యే రాజా సింగ్ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. మళ్లీ అరెస్ట్ చేస్తారా?
MLA Raja Singh : హైదరాబాద్ లోని గోషా మహల్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ విషయం చాలా రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే. ఆయన్ను గతంలో ఆగస్టు 25న మత విద్వేషాలను రెచ్చగొట్టారని.. ఆ విధంగా వ్యాఖ్యలు చేశారని ఆయనపై పీడీయాక్ట్ పెట్టి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి ఎమ్మెల్యే రాజా సింగ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దానికి కారణం… ఫేస్ బుక్ లో ఆయన పెట్టిన ఓ పోస్ట్. రాజా సింగ్.. ఓ పోస్ట్ కు కామెంట్ చేశారని.. అది కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందంటూ మంగళహాట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
MLA Raja Singh : రెండు రోజుల్లో రాజా సింగ్ వివరణ ఇవ్వాలని ఆదేశించిన పోలీసులు
హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి.. సామాజిక వర్గంపై రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు మళ్లీ చేయడంపై పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను గతంలో పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. రాజా సింగ్ ను అరెస్ట్ చేయడంతో బీజేపీ కూడా క్రమశిక్షణ చర్యలను తీసుకొని ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక.. నవంబర్ 9న ఆయనకు బెయిల్ లభించింది. అయితే.. భవిష్యత్తులో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని షరతుతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అయినా కూడా మళ్లీ ఫేస్ బుక్ పోస్ట్ విషయంలో మళ్లీ రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నోటీసులు జారీ చేశారు పోలీసులు. మరి.. ఈ నోటీసులపై రాజాసింగ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.