Flipkart Jobs : ఫ్లిప్‌కార్ట్ లో 2 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు..త్వరపడండి
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం భారీ స్థాయిలో తాత్కాలిక ఉద్యోగాలను ప్రకటించింది. సాధారణంగా ఈ సమయంలో ఆన్‌లైన్ ఆర్డర్లు విపరీతంగా పెరుగుతాయి. వినియోగదారుల అవసరాలను తీర్చడంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు కంపెనీ ప్రత్యేకంగా 2,20,000 మందికి పైగా కొత్త తాత్కాలిక ఉద్యోగులను నియమించనున్నట్లు వెల్లడించింది.

Flipkart has over 2 lakh temporary jobs
ఈ ఉద్యోగాలు ప్రధానంగా సప్లయ్ చైన్, లాజిస్టిక్స్, లాస్ట్ మైల్ డెలివరీ రంగాల్లో కేంద్రీకృతమై ఉంటాయి. వేర్‌హౌస్‌లలో పికర్స్, ప్యాకర్స్, సార్టర్స్ నుండి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, టీమ్ లీడర్లు, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ సపోర్ట్ వరకు విభిన్న స్థాయిలో కొత్త సిబ్బందిని నియమించనుంది. అంతేకాకుండా, చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా సేవలు అందించేందుకు టైర్-2, టైర్-3 నగరాల్లో 650కి పైగా ప్రత్యేక డెలివరీ హబ్‌లను ఏర్పాటు చేయాలని ఫ్లిప్‌కార్ట్ ప్రణాళిక వేసింది. దీంతో దూర ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు కూడా వేగంగా తమ ఆర్డర్లను అందుకోగలుగుతారు.
ఫ్లిప్‌కార్ట్ ఈసారి AI ఆధారిత టూల్స్ వినియోగించి సప్లయ్ చైన్‌ను మరింత సమర్థవంతంగా మార్చింది. దీంతో కస్టమర్లకు ఆర్డర్లు వేగంగా చేరడమే కాకుండా, భవిష్యత్తులో డిమాండ్ పెరిగినా తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మహిళలకు 10 శాతం అదనపు అవకాశాలు ఇవ్వడం, వికలాంగులకు కూడా ఉద్యోగాలను కేటాయించడం ద్వారా సమాన అవకాశాల సూత్రాన్ని అమలు చేస్తోంది. మరోవైపు అమెజాన్ కూడా ఈ సీజన్‌లో 1.5 లక్షలకుపైగా తాత్కాలిక ఉద్యోగాలను ప్రకటించింది. దీంతో ఈ పండుగ సీజన్ రెండు ప్రధాన ఈ-కామర్స్ దిగ్గజాలు లక్షలాది మందికి ఉపాధి కల్పించబోతుండగా, వినియోగదారులకు ఆఫర్లు, డిస్కౌంట్‌లు లభించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడం ఖాయం అవుతోంది.