Arun Goel Vs Rajiv Kumar : కేంద్ర ఎన్నికల సంఘంలో మరోసారి అంతర్గత విభేదాల‌కు కారణం ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Arun Goel Vs Rajiv Kumar : కేంద్ర ఎన్నికల సంఘంలో మరోసారి అంతర్గత విభేదాల‌కు కారణం ఏంటి..?

Arun Goel Vs Rajiv Kumar : న్యూఢిల్లి: కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ అరుణ్‌ గోయల్‌ రాజీనామా సంచలనం రేపుతోంది. భారత ఎన్నికల కమిషన్‌లో పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. గోయల్‌ రాజీనామా పట్ల అటు రాజకీయంగాను, ఇటు సామాజికంగాను భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముగ్గురు సభ్యుల స్థానంలో మొన్నటి వరకు ఇద్దరే ఉన్నారు. ఓవైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఆ ఇద్దరిలో ఒకరు వ్యక్తిగత కారణాల పేరుతో పదవీ బాధ్యతల్నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. […]

 Authored By tech | The Telugu News | Updated on :11 March 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  అరుణ్‌ గోయల్‌ రాజీనామాపై అన్ని వర్గాల్లోనూ చర్చ

  •  Arun Goel Vs Rajiv Kumar : రాజీవ్‌తో గోయల్‌ లడాయి.. కేంద్ర ఎన్నికల సంఘంలో మరోసారి అంతర్గత విభేదాలు..!

Arun Goel Vs Rajiv Kumar : న్యూఢిల్లి: కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ అరుణ్‌ గోయల్‌ రాజీనామా సంచలనం రేపుతోంది. భారత ఎన్నికల కమిషన్‌లో పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. గోయల్‌ రాజీనామా పట్ల అటు రాజకీయంగాను, ఇటు సామాజికంగాను భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముగ్గురు సభ్యుల స్థానంలో మొన్నటి వరకు ఇద్దరే ఉన్నారు. ఓవైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఆ ఇద్దరిలో ఒకరు వ్యక్తిగత కారణాల పేరుతో పదవీ బాధ్యతల్నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. ఈసీఐ అంతర్గత వర్గాల ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌తో గోయల్‌కు విభేదాలు తలెత్తాయని, ఆయనతో సర్దుకువెళ్లే పరిస్థితులు లేకపోవడం వల్లే ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సన్నాహాలను మీడియాకు తెలిపేక్రమంలో కోల్‌కతాలో విలేకరుల సమావేశానికి హాజరు కావడానికి గోయల్‌ నిరాకరించారు. దాంతో మార్చి 5న రాజీవ్‌ కుమార్‌ ఒంటరిగానే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయల్‌ గైర్హాజరీని ప్రస్తావిస్తూ, ఆయన అనారోగ్యం కారణంగా ఢిల్లీకి తిరిగివెళ్లారని వివరించారు. అయితే, ఈ ప్రకటనను గోయల్‌ సన్నిహిత వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్ని తీవ్రమైన విభేదాల కారణంగా పశ్చిమ బెంగాల్‌లో తన పర్యటనను కుదించుకుని ఢిల్లిdకి వచ్చేశాడని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఇద్దరు అధికారుల మధ్య ఏం జరిగింది? వారు ఏయే అంశాలపై విభేదించారు? అనే దాని గురించి స్పష్టత రాలేదు.

రాజీవ్‌ కుమార్‌తో ఇక కలిసి పనిచేయడం సాధ్యంకాదని నిర్ణయించుకున్న గోయల్‌, కనీసం రాజీనామా విషయాన్ని కూడా ఆయనతో ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. అందుకే నేరుగా రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపారని ఈసీ వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగాల్‌ పర్యటన తర్వాత, మార్చి 7న ఢిల్లిdలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సంబంధిత చర్చకోసం సీఈసీ రాజీవ్‌ కుమార్‌తో కలిసి గోయల్‌ పాల్గొన్నాడు. అయితే, ఆ మర్నాడు అంటే మార్చి 8న, రాజీవ్‌ కుమార్‌, కేంద్ర హోంకార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా మధ్య జరిగిన సమావేశానికి అరుణ్‌ గోయల్‌ దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత 24 గంటలు తిరగక ముందే రాజీనామా చేశారు. వాస్తవానికి ఈసీగా 2025లో బాధ్యతలు చేపట్టిన అరుణ్‌ గోయల్‌ పదవీకాలం 2027 నవంబర్‌ వరకు ఉంది. ఇదివరకే అనూప్‌ చంద్రపాండే పదవీ విరమణ చేశారు. దాంతో ముగ్గురు సభ్యుల భారత ప్రధాన ఎన్నికల సంఘం ఇప్పుడు ఒక్కరికే పరిమితమైంది.

Arun Goel Vs Rajiv Kumar కేంద్రం రాజీ ప్రయత్నం..

సీఈసీ రాజీవ్‌ కుమార్‌తో గోయల్‌ విభేదాలను సద్దుమణిగేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే గోయల్‌ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ససేమిరా అనడంతో ఫలితం లేకుండా పోయిందని సమాచారం. గతంలో అంటే 2020 ఆగస్టు 18న నాటి ఈసీగా ఉన్న అశోక్‌లావాసా కూడా ఇలాగే అర్థంతరంగా రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామాను ఆమోదించకుండా 13రోజులు పెండింగ్‌లో ఉంచారు. చివరకు ఆగస్టు 31న ఆమోదించడం జరిగింది. అయితే, అరుణ్‌ గోయల్‌ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. ఆయన రాజీనామా కొన్ని నిముషాల వ్యవధిలోనే ఆమోదం పొందింది. ఆ వెంటనే దీనిపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడేంత వరకు ఇసిఐలో కూడా ఎవరికీ ఈ విషయం తెలియకపోవడం మరింత ఆశ్చర్యకరం. తాజా పరిణామంపై గోయల్‌ బ్యాచ్‌మేట్‌ సంజీవ్‌ గుప్తా స్పందిస్తూ, అతని నియామకం ఎంత వేగంగా జరిగిందో, రాజీనామా ఆమోదం కూడా అంతేవేగంగా జరిగిందని పేర్కొన్నారు.

Arun Goel Vs Rajiv Kumar : అప్పుడూ.. ఇప్పుడూ.. నిముషాల్లోనే…

ఎన్నికల కమిషనర్‌గా గోయల్‌ నియామకం కూడా వివాదంలో చిక్కుకుంది. అతను నవంబర్‌ 18, 2022న ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (ఐఏఎస్‌) నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసున్న గోయల్‌, వాస్తవానికి డిసెంబర్‌ 31, 2022న సర్వీసు నుంచి పదవీ విరమణ పొందాల్సి ఉంది. కానీ అనూహ్యంగా వీఆర్‌ఎస్‌ తీసుకోవడం, ఆ మర్నాడే ఎన్నికల కమీషనర్‌గా నియమితులు కావడం చకాచకా జరిగిపోయాయి. ఇదంతా ముందస్తు వ్యూహం ప్రకారమే జరిగిందన్న విమర్శలు, ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. దీనిపై అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో ఇది ఏకపక్షంగా, భారత ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రత, స్వేఛ్చకు భంగం కలిగించిందని ఏడీఆర్‌ పేర్కొంది. అయితే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 2023లో ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

Arun Goel Vs Rajiv Kumar ఈసీఐ వ్యవహారంపై విచారణ చేపట్టాలి: మాజీ అధికారి శర్మ

భారత ఎన్నికల సంఘం స్థితి గురించి, ముఖ్యంగా ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా తర్వాత ఆందోళనలు లేవనెత్తుతూ భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ.ఎ.శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. కమిషన్‌లో సాధారణంగా ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమీషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాత్రమే ఉన్నారు. గోయెల్‌ రాజీనా కమిషన్‌ పనితీరుపై సందేహాలను కలిగిస్తోంది. సీఈసీ నిర్ణయాల్ని ఎన్నికల కమీషనర్‌ గోయల్‌ ప్రశ్నించారా అనేదానితో సహా పలు ప్రశ్నలను లేవనెత్తిన్నాయి అని శర్మ రాష్ట్రపతికి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. .

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది