PM Kisan : రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ పై మరో కీలక నిర్ణయం
PM Kisan దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను మరో ఐదేళ్ల పాటు, అంటే 2030-31 వరకు పొడిగించింది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6,000 సాయం కొనసాగనుండగా, ఇందుకోసం రూ.3.15 లక్షల కోట్లను కేంద్రం..
PM Kisan : దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతుల వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన PM Kisan Samman Nidhi Yojana ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ పథకం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉండనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయానికి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. రైతులకు నిరంతర పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.ఈ పథకాన్ని వచ్చే ఐదేళ్ల పాటు అమలు చేయడానికి రూ.3.15 లక్షల కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది అర్హులైన రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చనుంది.
PM Kisan : రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ పై మరో కీలక నిర్ణయం
PM Kisan ద్వారా రైతులకు ఎలా సాయం అందుతోంది?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా రూ.2,000 చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో నేరుగా జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 23 విడతల నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ప్రస్తుతం ఖరీఫ్ సాగు సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు 24వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో పీఎం కిసాన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు మరింత ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.
సూర్య సరోవర్ యోజనతో పాటు ఇతర కీలక పథకాలకు కూడా ఆమోదం
పీఎం కిసాన్ పథకం పొడిగింపుతో పాటు కేంద్ర కేబినెట్ పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కోసం రూ.5,070 కోట్లు కేటాయించింది. అలాగే దేశంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖేలో ఇండియా కార్యక్రమానికి రూ.29 వేల కోట్లు, సముద్ర రంగ అభివృద్ధి కోసం సముద్ర మంథణ్ పథకానికి రూ.84 వేల కోట్లు కేటాయించింది.
ఇక దేశవ్యాప్తంగా సొరంగాల నిర్మాణం, రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.9,779 కోట్ల నిధులను కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పీఎం కిసాన్ పథకం పొడిగింపుతో రైతులకు పెట్టుబడి సాయం నిరంతరంగా కొనసాగనుండగా, వ్యవసాయం, విద్యుత్, క్రీడలు, మౌలిక సదుపాయాల రంగాల్లో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాలు దేశ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







