Bandi Sanjay : అయ్యా.. బండి సంజయ్.. ఏందయ్యా ఇది.. అంత దిగజారిపోవాలా?
Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ మునుగోడు సభను ఎప్పుడైతే నిర్వహించిందో అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. అందులో ఒకటి జూనియర్ ఎన్టీఆర్, రామోజీ రావుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయితే మరొకటి అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్ వార్త. మునుగోడులో బీజేపీ సభ ముగిసిన అనంతరం.. అమిత్ షా హైదరాబాద్ కు వచ్చిన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి వెళ్లారు.
ఆలయం లోపలికి వెళ్ళేముందు ఆయన చెప్పులను గుడి ముందు విడిచి లోపలికి వెళ్లారు. ఆయన వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన అమిత్ షాకు వెంటనే అక్కడ అమిత్ షా విడిచిన చెప్పులను చేతులతో పట్టుకొని ఆయన దగ్గరికి తీసుకొచ్చి అందించారు. దీంతో అమిత్ షా తన చెప్పులు వేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bandi Sanjay : చెప్పుల వీడియో స్పందించిన పలువురు నేతలు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియోను చూసిన పలువురు రాజకీయ నేతలు బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు బండి సంజయ్ తో చెడుగుడు ఆడుకుంటున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడిని తెలంగాణ రాష్ట్రం గమనిస్తోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉంది. జై తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది.
జై తెలంగాణ! https://t.co/SpFCHAszYe
— KTR (@KTRBRS) August 22, 2022
ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఘటనపై విరుచుకుపడుతున్నారు. బానిస రాజకీయాలకు బీజేపీ తెరలేపిందంటూ మండిపడుతున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోదీ, షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు.
అయితే.. త్వరలో మునుగోడు ఉపఎన్నిక, వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దీన్నే ప్రధాన అస్త్రంగా వాడుకొని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం సాగించే అవకాశం ఉంది.