Bandi Sanjay : ఈటల రాకతో.. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటుందా? ఊడుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandi Sanjay : ఈటల రాకతో.. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటుందా? ఊడుతుందా?

 Authored By sukanya | The Telugu News | Updated on :28 July 2021,2:30 pm

తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. వైఎస్ ష‌ర్మిల ఎంట్రీతో ఆస‌క్తిక‌రంగా మారిన రాజ‌కీయాలు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో పీక్స్‌కు చేరాయి. తాజాగా మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రాజీనామాతో ఇంకా ఉత్కంఠ‌ను క‌లిగిస్తున్నాయి. అయితే, ఈట‌ల రాజీనామా, త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో బీజేపీలోనూ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సెంటర్ ఆఫ్ ద టాపిక్ గా మారుతున్నారని అటు కేడర్ ఇటు నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ఆది నుంచి బండి సంజయ్ పై గరంగా ఉన్న నేతలే .. దీనివెనుక కీ రోల్ పోషిస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. అందుకోసం వీరంతా .. టైం చూసి, కొడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.

bandi sanjay telangana bjp president karimnagar

bandi sanjay telangana bjp president karimnagar

ఈటెల రాకే..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, అనంత‌రం బీజేపీలో చేరడాన్ని పార్టీ నేతలు కొంద‌రు వ్యతిరేకించారు. ఈటెలను చేర్చుకునే సమయంలో వీరి అభిప్రాయాలకు బండి సంజయ్ విలువ ఇవ్వలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపించాయి. ఇదే సమయంలో ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. అదే అదునుగా ఈటెల రాకను వ్యతిరేకిస్తోన్న ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌లు బీజేపీని వీడటం ఆస‌క్తిక‌రంగా మారింది. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. వీరిద్దరూ తమ లేఖలో ఈటలను చేర్చుకుని తప్పు చేశారంటూ ప్రకటించడం విశేషం. కనీసం తమకు తెలపలేదని, తమతో చర్చించలేదని వీరిద్దరూ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనే ఆరోపణలు గుప్పించారు.

వలసలే ..

ఇదిలా ఉంటే, పలువురు బీజేపీ నేత‌లు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆస‌క్తి చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామాలు బీజేపీ నేత‌ల్లో ఆందోళ‌న‌కు కార‌ణంగా మారాయి. ఇదే .. ఇప్పుడు బండి సంజయ్ పై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టేలా చేస్తోంది. ముందునుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకాన్ని తప్పు పట్టిన కొంతమంది పార్టీని పలువురు నేతలు వీడుతున్నా, బండి సీరియస్ గా తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆయన్ని వ్యతిరేకిస్తోన్న నేతలు వలసల్ని ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈటెల సాకుతో సంజయ్ దూకుడుకు బ్రేక్ వేసే వ్యూహం పన్నుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి దీన్నుంచి బండి సంజయ్ ఏవిధంగా బయటపడతారన్న చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. ఏదేమైనా ఈటెల రాక .. బండికి ఇబ్బందికరంగా మారిందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తుండడం విశేషం.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది