ChandraBabu : ఔను, బీజేపీలో వాళ్ళంతా చంద్రబాబు గూటి పక్షులే.!
ChandraBabu : తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి, భారతీయ జనతా పార్టీలోకి దూకేశారు. ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారట. రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలం ముగిసిన దరిమిలా, భారతీయ జనతా పార్టీకి కూడా ఇకపై తనతో ఉపయోగం వుండదనే నిర్ణయానికి సుజనా చౌదరి వచ్చేశారని తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి, చంద్రబాబు వ్యూహాత్మకంగా సుజనా చౌదరిని పంపించారనే ప్రచారం గతంలోనే జరిగింది. వెళ్ళిన పని పూర్తి చేసుకున్న సుజనా చౌదరి, తన పని పూర్తయిపోవడంతో తిరిగి సొంత పార్టీలోకి వెళ్ళిపోతున్నారట.
అయితే, ఈ ప్రచారంపై ఇంతవరకు సుజనా చౌదరి స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో మొత్తం నాలుగు గ్రూపులున్నాయి. అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినదొకటి, తెలుగుదేశం పార్టీకి చెందినది ఇంకోటి. అలాగే బీజేపీకి చెందిన ఇంకో గ్రూపు, దాంతోపాటుగా అసలు సిసలు బీజేపీ గ్రూ మరొకటి. ఇలా ఈ గ్రూపుల పంచాయితీ కారణంగానే బీజేపీ, ఏపీలో ఎదుగూ బొదుగూ లేకుండా పోతోంది. బీజేపీలో వున్న వైసీపీ సానుభూతిపరులు మొదటి నుంచీ సుజనా చౌదరిని నమ్మొద్దని అధినాయకత్వానికి సూచిస్తూనే వున్నా, బీజేపీలోని మిగతా గ్రూపులు డామినేషన్ ప్రదర్శించాయి. ఇప్పుడేమో, సుజనా సహా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చినవారి నిజస్వరూపం తెలుసుకుని బీజేపీ అధినాయకత్వం అవాక్కవుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో వైసీపీతో జతకట్టడమో, లేదంటే సొంతంగా వుండడమొక్కటే బీజేపీకి కలిసొస్తుందనీ, లేనిపక్షంలో బీజేపీ బాగుపడే అవకాశం లేదనీ, మిత్రపక్షం జనసేన ఎలాగూ తెలుగుదేశం పార్టీకి వలవేస్తోందని నిఖార్సయిన బీజేపీ వాదులు, బీజేపీలోని వైసీపీ సానుభూతిపరులు తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారట. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏపీలో దారుణంగా దెబ్బ తింది. అంతకు ముందు.. అంటే, 2014లో టీడీపీతో జత కట్టి, జనసేన మద్దతు ద్వారా అసెంబ్లీ సీట్లు అలాగే లోక్ సభ సీట్లను కూడా సింగిల్ డిజిట్‌లో అయినా గెలుచుకోగలిగింది. సమీప భవిష్యత్తులో బీజేపీకి అలాంటి అదృష్టం దక్కే అవకాశమే లేదు. అకారణంగా వైసీపీ మీద బీజేపీలో కొందరు చేస్తున్న విమర్శలతో, ఏపీలో బీజేపీ నానాటికీ మరింత చులకనైపోతోంది. దానికి తోడు టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన రావెల కిషోర్, సుజనా చౌదరి లాంటి కోవర్టులతో బీజేపీ మరింతగా దెబ్బతింది.