ఏపీలో బీజేపీని మించిన రాజకీయాలు చేస్తున్న జనసేన.. పవన్ గాడిలో పడినట్టే ఇక?
ఏపీ ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంటే ఒకటే. అదే రామతీర్థం ఘటన. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన రాష్ట్రాన్ని అట్టుడికించింది. జాతీయంగానూ ఈ ఘటన చర్చకు దారితీసింది. రాష్ట్రంలో ఎన్నో గుళ్ల మీద దాడి జరిగినప్పటికీ.. ఈ ఘటన మాత్రం కొంచెం సీరియస్ అయింది. చివరకు చంద్రబాబు కూడా అక్కడికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ.. రామతీర్థం ఘటనను ఏపీ ప్రజలు మరిచిపోలేకపోతున్నారు.
ఇక.. ఏపీలోని ప్రధాన పార్టీలు కూడా రచ్చ రచ్చ చేశాయి. బీజేపీ అయితే ఏకంగా రాముడి గుడి వద్దకే వెళ్లి అక్కడ ఆందోళన నిర్వహించింది. ఆ ఆందోళనలో జనసేన కూడా పాల్గొన్నది. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తును ఆదేశించింది.
కానీ.. అక్కడితో ఏం అయిపోలేదు. ముందున్నది మొసళ్ల పండుగ. బీజేపీ ఈ ఘటనపై కొన్ని రోజులు హడావుడి చేసి పక్కకు జరిగినా.. జనసేన మాత్రం ఈ ఘటనను వదలట్లేదు.
ఏపీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జనసేన తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే.. రామతీర్థం ఘటనను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ముందడుగు వేసి.. ఉత్తరాంధ్ర జిల్లాల వరకు జనసేనకు చెందిన నలుగురు పార్టీ నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. రామతీర్థం ఘటన మీద పోరాటం చేస్తుందని జనసేన ప్రకటించింది.
అంటే.. రామతీర్థం ఘటనను ప్రజలు వదిలినా.. రాజకీయ పార్టీలు వదిలేలా లేవు. చూద్దాం మరి.. ఇది ఇంకా ఎంతదూరం వెళ్తుందో?