YS Jagan : వైఎస్ జగన్ ను పక్కన పెట్టిన కేంద్రం? ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అందుకే భద్రత కల్పించిందా?
YS Jagan : కేంద్ర ప్రభుత్వంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ బాగానే ఉంటున్నారు. కానీ.. కేంద్రమే ఎందుకో ఏపీ ప్రభుత్వంపై చిన్న చూపు చూస్తోంది. చాలా విషయాల్లో ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు.. ఏపీకి ప్రత్యేక హోదా కావచ్చు… నిధుల విషయం కావచ్చు… ఇలా ప్రతి విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఇరుకున పెడుతూనే ఉన్నది. చాలాసార్లు సీఎం జగన్… కేంద్రానికి విన్నవించినా… ఏనాడూ కేంద్రం సరిగ్గా స్పందించలేదు అనే విమర్శ కూడా ఉంది. తాజాగా మరోసారి సీఎం జగన్ ను కేంద్రం పక్కన పెట్టేసింది. వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్రం భద్రత కల్పించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తనకు ఢిల్లీలో ఉన్నన్ని రోజులు రక్షణ కల్పించాలని.. సీఎం జగన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని.. రఘురామకృష్ణంరాజు ప్రధాన మంత్రితో పాటు కేంద్ర హోమంత్రికి, హోంశాఖ కార్యదర్శికి రఘురామకృష్ణంరాజు లేఖలు రాశారు. ఆయన లేఖలపై స్పందించిన కేంద్ర హోంశాఖ… రఘురామకృష్ణంరాజుకు రక్షణ కల్పించేందుకు పర్మిషన్ ఇచ్చింది.
నన్ను హతమారుస్తామంటూ.. బెదిరింపు కాల్స్ చేస్తున్నారు?
నన్ను చంపేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాకు బెదిరింపు కాల్స్ వచ్చినా నేను పెద్దగా ఆందోళన చెందడం లేదు కానీ…. సీఎం జగన్ కు ఉన్న నేర చరిత్ర వల్ల నాకు కొంచెం ఆందోళన కలుగుతోంది. నాపై తప్పుడు కేసులు కూడా పెట్టారు. నన్ను జైలుకు పంపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన సొంత జిల్లా కడప నుంచే ప్రొఫెషనల్ కిల్లర్లను పెట్టుకున్నట్టు నాకు తెలిసింది. నాకు ఏపీలో, హైదరాబాద్ లో వై కేటగిరీ భద్రత ఉంది. కానీ… ఢిల్లీలో లేదు. అందుకే ఢిల్లీలో కూడా నాకు అదే స్థాయి భద్రత కల్పించండి… అంటూ ఎంపీ రఘురామ కేంద్రానికి లేఖ రాశారు.
ఎంపీ రఘురామ కావాలని బీజేపీ అండతో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. కావాలని వైసీపీని ఇబ్బంది పెట్టాలని… ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్రంతో చేతులు కలిపి.. ఏపీలో బీజేపీని బలోపేతం చేయడం కోసం వేసే ఎత్తుగడలు ఇవి అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.