ఈ నెల 26న ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్‌గా కనిపించనున్న చంద్రుడు..
ఆకాశంలో సహజంగానే సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంటాయి. అయితే కొన్ని సార్లు సంపూర్ణ సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతాయి. వాటిల్లోనూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సూర్యుడు, చంద్రుడు మనకు భిన్న రకాల రంగుల్లో కనిపిస్తారు. ఇక త్వరలోనే చంద్రుడు మనకు భిన్న రంగుల్లో కనిపించనున్నాడు.
ఈ నెల 26వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తారు. సూర్యుడు, చంద్రుని మధ్యలోకి భూమి వస్తుంది. ఈ క్రమంలో సూర్య కిరణాలు చంద్రునిపై పడవు. భూమి నీడ చంద్రునిపై పడుతుంది. ఆ సమయంలో కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు.
మే 26వ తేదీన ఈ గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు 14 నిమిషాల 30 సెకన్ల పాటు గ్రహణం ఉంటుంది. ఆ సమయంలోనే చంద్రుడు మనకు అలా కనిపిస్తాడు. ఇక ఈ ఖగోళ వింతను ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ అమెరికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో వీక్షించవచ్చు.
కాగా మే 26వ తేదీన ఏర్పడనున్న సంపూర్ణ చంద్ర గ్రహణం తరువాత మళ్లీ జూన్ 10వ తేదీన వార్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. తరువాత నవంబర్ 19న పాక్షిక చంద్ర గ్రహణం, డిసెంబర్ 4వ తేదీన సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనున్నాయి.