Botsa Satyanarayana : రాజధాని తరలింపుపై బొత్స చేసిన వ్యాఖ్యలకు ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్?
Botsa Satyanarayana : ఏపీలో ప్రస్తుతం రాజధాని తరలింపు అనే అంశం వాడీవేడీగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి అంటూ ఒకే రాజధానిని ప్రకటించారు. ఆ తర్వాత 2019 లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక…. ఏపీ అభివృద్ధి జరగాలంటే… ఒక్క రాజధాని ఉంటే సరిపోదన్నారు. ఏపీలో మూడు ప్రాంతాలు ఉన్నాయని… రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర.. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలన్నా… అన్ని ప్రాంతాలు ఒకే విధంగా అభివృద్ధి చెందాలన్నా… ఒక్క అమరావతి రాజధాని వల్ల కాదని… అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మరో తలనొప్పి ప్రారంభం అయింది.
ఇలా రాజధానులను మారుస్తూ పోతే.. ఏపీకి భవిష్యత్తు ఉండకుండా పోతుందని… కొందరు ఆరోపించారు. ఏపీకి ఒకటే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధానుల తరలింపు వల్ల ఎక్కువ నష్టపోయేది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే.
ఏది ఏమైనా… వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులపై ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నది. తాజాగా రాజధాని తరలింపుపై మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Botsa Satyanarayana : త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధానిని మారుస్తాం
అయితే.. త్వరలోనే విశాఖను పరిపాలన రాజధానిగా మారుస్తామని బొత్స స్పష్టం చేశారు. ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకూడదని… ప్రాంతీయ అభిప్రాయ భేదాలు ఉండకూడదని… సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులను ప్రకటించారని బొత్స స్పష్టం చేశారు.
అందుకే… త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధానిని మారుస్తున్నామని.. విశాఖలో పరిపాలన భవనాల కోసం… మధురవాడ, పుప్పాలవాడ, భీమిలి ప్రాంతాలను పరిశీలించామని… అక్కడ స్థలాలను కూడా అధికారులు గుర్తించారని ఆయన స్పష్టం చేశారు.
బొత్స చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత తొందర పడటం, అనాలోచిత నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు కేసు కోర్టులో నడుస్తుంటే… ఇంత త్వరగా విశాఖకు పరిపాలన రాజధానిని తరలించడం ఎందుకు? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులైతే టెన్షన్ తో భయపడుతున్నారు. ఇప్పటికే.. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లారు. మళ్లీ ఇప్పుడు విజయవాడ నుంచి విశాఖపట్నం అంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.