BJP : హైదరాబాద్ పేరుని బీజేపీ ‘భాగ్యనగరం’గా మార్చగలదా.?
BJP : హైద్రాబాద్‌కి ఫలానా జాతీయ సంస్థను తెస్తాం.. అని కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ చెబితే అదో లెక్క. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తామని చెబితే, దాన్నీ ఆహ్వానించాల్సిందే. రైల్వే కోచ్ ఫ్యాక్టరీనో, స్టీలు ప్లాంటో.. ఇలాంటి మంచి పనులు చేస్తామంటే బీజేపీని ఎవరైనా స్వాగతిస్తారు. అది బీజేపీకి రాజకీయంగా కూడా ఎంతో ఉపయోగం. కానీ, హైద్రాబాద్ పేరుని భాగ్యనగరంగా మారుస్తామంటూ బీజేపీ నినదిస్తే, పట్టించుకునేదెవరు.? ఈమాత్రం సోయ కూడా లేకుండా పోయింది కొందరు బీజేపీ జాతీయ నాయకులకి. హైద్రాబాద్ విశ్వనగరం అవదగ్గ స్థాయి వున్న మహానగరం.
ప్రపంచ స్థాయిలో హైద్రరాబాద్‌కి విశేషమైన పేరు ప్రఖ్యాతులున్నాయి. అలాంటి హైద్రాబాద్ పేరుని మార్చాల్సిన అవసరమేంటో బీజేపీ నాయకత్వానికే తెలియాలి. నిజానికి, ఇలాంటి ప్రకటనల వల్ల బీజేపీ తన స్థాయిని తగ్గించుకుంటుంది. ‘మేం అధికారంలోకి వస్తే బీజేపీ పేరు మార్చేస్తాం..’ అనడం బీజేపీ నేతలకు ఫ్యాషన్‌గా మారింది.. అది బీజేపీకి తెలంగాణలో చేటు చేస్తోంది కూడా. ‘పేరు మార్చుతారా.? మార్చడానికి వాళ్ళెవరు.?’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ ప్రకటనపై మండిపడుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకోసం హైద్రాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ నాయకత్వం, హైద్రాబాద్ పేరు మార్చడం మీద ఆసక్తి చూపడమేంటన్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రశ్న. తెలంగాణకు ఏం మేలు చేస్తారో చెప్పరుగానీ, పేరు మార్చేస్తారా.? అంటూ పలువరు తెలంగాణ మంత్రులూ నిలదీస్తున్నారు. తెలంగాణ సమాజం కూడా బీజేపీ తీరుని ఈ పేరు మార్పు విషయమై తప్పు పడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈ పేరు మార్పు నినాదాలతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని గుర్తిస్తే మంచిది. పేరు మార్చినా మార్చకపోయినా హైద్రాబాద్ అంటే భాగ్యనగరమే. కొత్తగా మళ్ళీ భాగ్యనగరం అని పేరు పెట్టడం వల్ల వీసమెత్తు అదనపు ప్రయోజనం వుండదు.