Chandrababu : చంద్రబాబు కష్టం ఫలించినట్లే.! టీడీపీ ట్రాప్‌లో బీజేపీ మళ్ళీ పడినట్టే.!
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కష్టం దాదాపుగా ఫలించినట్లే. అన్నీ ఆయన అనుకున్నట్లు జరిగితే, త్వరలో.. అతి త్వరలో ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ చేరిపోతుంది. మళ్ళీ కేంద్ర మంత్రి పదవిని టీడీపీ కోరుతుందా.? బీజేపీ ఇష్తుందా.? ఏమోగానీ, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలనే కసితో వున్న చంద్రబాబుకి, బీజేపీ నుంచి కొంత మద్దతైతే లభించేలా వుంది. కానీ, ఏ మొహం పెట్టుకుని బీజేపీ పంచన చంద్రబాబు చేరుతున్నారు.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజకీయాల్లో అలాంటివేమీ వుండవు. బీజేపీని నానా మాటలూ తిట్టి, 2014 ఎన్నికలకు ముందు బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోలేదా.? ఇప్పుడూ అంతే. బీజేపీ సైతం, చంద్రబాబు మాయమాటలకు లొంగిపోయినట్లే కనిపిస్తోంది.
ఓ నేషనల్ మీడియాకి చెందిన న్యూస్ ఛానల్, ఎన్డీయేలో టీడీపీ చేరబోతున్నట్లు పేర్కొంది. ఆ న్యూస్ ఛానల్ కూడా బీజేపీకి చాలాకాలంగా మద్దతిస్తోంది. బీజేపీ నేతలే ఆ ఛానల్‌ని రన్ చేస్తున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్ళి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యింది.. టీడీపీ – బీజేపీ పొత్తు కోసమేనన్న ప్రచారానికి ఇప్పుడు దాదాపుగా ఆధారం దొరికేసినట్లే. వాస్తవానికి, బీజేపీ ఆలోచనలు వేరేలా వున్నాయ్. తెలంగాణలో అధికారంలోకి రావడమనేది బీజేపీ ముందున్న పెద్ద వ్యూహం. ఈ క్రమంలో తెలంగాణలో కలిసొచ్చే రాజకీయ శక్తుల్ని కలుపుకుపోతోంది బీజేపీ. గ్రేటర్ పరిధిలో వున్న ఓట్లు కావొచ్చు, ఖమ్మం లాంటి చోట్ల టీడీపీకి వున్న ఓట్లు కావొచ్చు…
వీటిని బీజేపీ ఆశిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీతో సంప్రదింపులకు బీజేపీ కూడా ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత సుజనా చౌదరి, సీఎం రమేష్ సహా మొత్తం నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ లాగేసుకున్నా, చంద్రబాబు ఏమీ అనలేకపోయారు. ఇప్పుడెలా బీజేపీతో కలుస్తున్నారు.? అన్న ప్రశ్నకు ఇటు టీడీపీ వద్దగానీ, అటు బీజేపీ వద్దగానీ సమాధానం లేదు. రాజకీయాల్లో అవసరాలుంటాయ్.. ఆ అవసరాలిలా తీర్చుకుంటున్నారంతే.