ChandraBabu : మోడీతో వేదికను పంచుకునే ఛాన్స్.. చంద్రబాబు వదులుకున్నార్ట.!
ఇంతకు మించిన అద్భుతమైన అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా.? ఏమో, రాకపోవచ్చు. రాజకీయ విబేధాల్ని పక్కన పెట్టి, హుందాతనం ప్రదర్శించాల్సిన సంద్భమిది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కూడా, భీమవరంలో జరిగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొని వుంటే ఎంత బావుంటుంది.? ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకలు అలాగే, అల్లూరి జయంతి వేడుకల నేపథ్యంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం వెరీ వెరీ స్పెషల్ అయ్యింది.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం ఇది. ఇందులో పాల్గొనడాన్ని ఎవరైనా ఓ గౌరవంగా భావించాలి. ముఖ్యమంత్రి ఎలాగూ ప్రోటోకాల్ ప్రకారం వస్తారు. ప్రధాని హాజరయ్యే కార్యక్రమం గనుక ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా వెళితే హుందాగా వుంటుంది. కానీ, చంద్రబాబు అందుకు ససేమిరా అంటున్నారట. తనకు ఆహ్వానం అందినాగానీ, తాను వెళ్ళబోవడంలేదనీ, తమ పార్టీ తరఫున ప్రతినిథిని పంపిస్తామనీ సమాచారమిచ్చారట. టీడీపీ నుంచి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమానికి హాజరవనున్నారట. ఇవే, ఇలాంటి రాజకీయ ఆలోచనలే చంద్రబాబు పక్కన పెడితే మంచిది.

ChandraBabu To Miss The Golden Opportunity
మన్యం వీరుడి విగ్రహావిష్కరణకీ, ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకకీ హాజరైతే.. తద్వారా చంద్రబాబుకి ప్రజల్లోనూ ఓ మంచి ఇమేజ్ ఏర్పడుతుంది. గతంలో రాజధాని అమరావతి శంకుస్థాపనకు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హాజరు కాలేదు కాబట్టి.. అంటూ కుంటి సాకులు చెప్పాలని చంద్రబాబు అనుకుంటే అతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. రాజకీయాలు వేరు, రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు వేరు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. రాజకీయాలే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకూ పరమావధి.!