BJP vs TDP : ఇదొక్కటీ జరిగితే బీజీపీ – టీడీపీ పొత్తు గ్యారెంటీ..!
BJP vs TDP : టీడీపీ పార్టీ ప్రస్తుత పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. 2014 ఎన్నికల్లో ఏపీలో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన చంద్రబాబు.. బీజేపీతో కలిసి పోటీ చేయడం వల్ల గెలిచారు. కానీ.. ఆ తర్వాత బీజేపీతో వైరం పెంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీనే చంద్రబాబు అప్పట్లో పక్కన పెట్టేశారు. దీంతో బీజేపీ కూడా టీడీపీతో తెగతెంపులు చేసుకుంది. కట్ చేస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.
ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. సొంతంగా పోటీ చేసి వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు. దీంతో పొత్తుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి.. జననేత పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తున్నప్పటికీ.. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంక్ అంతగా లేదు.
BJP vs TDP : ముందు తెలంగాణలో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు
బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న చంద్రబాబు.. ముందు తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. తెలంగాణలో చంద్రబాబుకు ఉన్న పాపులారిటీ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన్ను ఇప్పటికీ తెలంగాణ వ్యతిరేకిగానే తెలంగాణలో చూస్తున్నారు.అసలు తెలంగాణలో టీడీపీ నాయకులే లేరు. ఒకవేళ.. టీడీపీకి అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉందని బీజేపీ భావించి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూసినా దాన్నే సీఎం కేసీఆర్ చాన్స్ గా తీసుకొని బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకోలేదు. దీంతో టీడీపీ కాంగ్రెస్ తో కలిసి మహాకూటమిగా ఏర్పడి తెలంగాణలో పోటీ చేసింది.
నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీ ప్రస్తుతం అయితే బీజేపీనే. వచ్చే ఎన్నికల్లో కాకపోయినా ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో అయినా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అవసరమా అని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ కు తీవ్రమైన నష్టం జరిగింది అనే వార్తలూ అప్పట్లో వచ్చిన విషయం తెలిసిందే. అందులో టీడీపీ తెలంగాణలో కంటే ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బెటర్ అనే వార్తలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి.