CM Jagan : చెడిపోయిన వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం.. సీఎం జగన్
CM Jagan : వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్ టెర్మినల్ ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన కోసం వైఎస్సార్ కడప జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్ శనివారం నాడు పులివెందులలో నూతనంగా నిర్మించిన బస్ టెర్మినల్ ను ప్రారంభించారు. అనంతరం బస్ టెర్మినల్ ను సీఎం జగన్ స్వయంగా పరిశీలించి, ఆర్టీసీ కార్యాలయం, కాంప్లెక్స్ నిర్మాణ శైలిని ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ముందు సీఎం జగన్ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. బస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానిక మహిళలు, చిన్నారులు నాయకులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. అనంతరం బస్ టెర్మినల్ ప్రారంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పులివెందులను ఆదర్శ నియోజకవర్గం చేయడం
కోసం మూడున్నరేళ్లుగా సమున్నత అడుగులు పడ్డాయన్నారు. అందులో భాగంగానే అత్యాధునిక వసతులతో మోడల్ టెర్మినల్ తరహాలో పులివెందుల్లో బస్ టెర్మినల్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ బస్ టెర్మినల్ మిగతా వాటన్నిటికీ రోల్ మోడల్ గా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పులివెందులలో బస్ టెర్మినల్ కూడా కట్టలేని స్థితిలో ఉన్నారని విమర్శించిన చంద్రబాబుకు ఈ బస్ టెర్మినల్ చూస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుస్తుందని చురకలంటించారు. ప్రస్తుత పులివెందుల బస్ టెర్మినల్ చూస్తే వాళ్లకు అసూయ కలుగుతుందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పేద ప్రజల తలరాతలు మారుతున్నాయంటూ ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమం దిశగా వివక్ష లేని దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామన్న సీఎం జగన్, సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరుస్తున్నామని పేర్కొన్నారు.
CM Jagan : రూ. 13 వేల కోట్లతో పులివెందుల మీదుగా ఆరులేన్న హైవే..
రాష్ట్రంలో పులివెందుల నుంచి బెంగళూరు వరకు నాలుగు లేన్ల హై వే నిర్మాణం కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు సీఎం జగన్ వివరించారు. దీంతో పాటు రూ.13 వేల కోట్ల ఖర్చుతో బెంగుళూరు నుంచి పులివెందుల మీదుగా విజయవాడ వరకు ఆరు లేన్ల రహదారి విస్తరణ కృషి చేస్తున్నట్లు తెలిపారు. పులివెందుల పట్టణంలోని ఐదు జంక్షన్లలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల చిరకాల కోరిక అయిన రాయలపురం బ్రిడ్జిని కూడా ప్రారంభించామన్నారు. సంక్షమం అభివృద్ధి రెండు కళ్ల తరహాలో అభివృద్ధి జరుగుతున్నా ఎల్లో మీడియా అవేం పట్టనట్లు తప్పుడు
ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంద్రజ్యోతి, వీరి దత్తపుత్రుడు వంటి చెడిపోయిన వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వీరికి కనపడదు వినపడదు అన్నట్లుగా తప్పుడు రాతలు రాస్తున్నారని పేర్కొన్నారు. ఈ తప్పుడు రాతలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. పులివెందుల ప్రజలు నాకు ఇస్తున్న భరోసాతోనే వచ్చే ఎన్నికల్లో మనం 175 స్థానాల్లో విజయం సాధించగలమన్నారు. ఈ సంకల్పంతో వైఎస్సార్ సీపీ మొక్కవోని దీక్షతో పనిచేస్తోందని వివరించారు.