KCR : ఉగాది తర్వాత కేసీఆర్ పర్యటన.. చిన్నపాటి పాదయాత్రే? నష్టాన్ని పూడ్చుకోవడానికేనా?
KCR తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ గడ్డుపరిస్థితులను ఎదుర్కుంటోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తే.. టీఆర్ఎస్ పార్టీ గెలవడం కష్టమే. తెలంగాణలో అతివేగంగా బీజేపీ పార్టీ దూసుకుపోతోంది. జెట్ స్పీడ్ లో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో ఉంది బీజేపీ. అందుకు తగ్గ ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నారు బీజేపీ నేతలు.
ఇలాగే చూస్తూ కుర్చుంటే.. కూర్చున్న సీటును కూడా లాక్కొని వెళ్లేలా ఉన్నారు బీజేపీ వాళ్లు.. అని అనుకొని సీఎం కేసీఆర్ వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో వెంటనే కేసీఆర్ కూడా అప్రమత్తమయ్యారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎలా గెలిపించాలి… భవిష్యత్తులో మరోసారి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోకుండా ఏం చేయాలి? అనే దానిపై మేథోమథనం చేస్తున్నారు.
భవిష్యత్తులో చాలా ఎన్నికలు తెలంగాణలో రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలవాలన్నా.. టీఆర్ఎస్ పార్టీని మళ్లీ ప్రజలు నమ్మాలన్నా.. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి.. అనే దానిపైనే టీఆర్ఎస్ హైకమాండ్ లో సందిగ్దత నెలకొన్నది.
ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసమే : KCR
అందుకే.. సీఎం కేసీఆర్ ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట. ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టాలను తెలుసుకుంటే బెటర్ అనే భావనలో ఉన్నారట. వాళ్ల సమస్యలేంటో తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తే కొంతలో కొంతైనా ప్రజలు కేసీఆర్ ను నమ్మే చాన్స్ ఉంది. ఆ చాన్స్ ను ఎందుకు వదులుకోవాలి.. అన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ముందు వరంగల్, కరీంనగర్ పర్యటన
నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ బలం ఉన్నది అంటే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో. కానీ.. అది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం తగ్గుతోంది. అందుకే.. ముందుగా వరంగల్, కరీంనగర్ జిల్లాల పర్యటన చేయడానికి కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి.. అంటే ఇది ఒక చిన్నపాటి పాదయాత్ర అని కూడా అనుకోవచ్చు.. క్షేత్రస్థాయి పర్యటన చేసి.. ఆ పర్యటన ద్వారా ప్రజలతో మమేకం అయి మళ్లీ వాళ్ల నమ్మకాన్ని పొంది.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అప్రతిహాతంగా గెలవాలన్నదే కేసీఆర్ ప్లాన్.
మరి.. ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.