Bypoll: ఈనెల 17న ఉపఎన్నిక.. కరోనాతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతి.. విషాదంలో పార్టీ నేతలు?
Bypoll : అది ఏ ఎన్నిక అయినా సరే.. ప్రచారం అనేది చాలా ముఖ్యం. ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అభ్యర్థి ప్రచారం చేయడం ఎక్కడైనా కామన్. కానీ… ఎన్నికల ప్రచారం వల్ల ఆరోగ్యం దెబ్బతిని ఆ అభ్యర్థి మరణిస్తే ఎలా ఉంటుంది. అది కూడా ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం ఉన్నప్పుడు ఆ అభ్యర్థి మరణిస్తే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించుకోలేం. అటువంటి ఘటనే ఒకటి ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పూరీ జిల్లాలోని పిపిలీ నియోజకవర్గం ఉపఎన్నిక బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ మంగరాజ్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈనెల 17న పిపిలీ నియోజకవర్గ ఉపఎన్నిక జరగనుంది. దీంతో అన్న పార్టీల అభ్యర్థుల్లాగే తాను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే… ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలోనే ఈనెల 7న అజిత్ కు ఆరోగ్యం దెబ్బతిన్నది. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత రెండు రోజులకు అజిత్ కు కరోనా సోకినట్టు డాక్టర్లు తెలిపారు.
నాకు కరోనా సోకింది.. ట్రీట్ మెంట్ నడుస్తోంది. నా అభిమానుల కోసం నేను తిరిగి వస్తాను… అని అజిత్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ఆయనకు కరోనాకు సంబంధించిన ట్రీట్ మెంట్ చేస్తుండగానే.. ఆయన ఆరోగ్యం విషమించి మృతి చెందారు. భువనేశ్వర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో పిపిలీ నియోజకవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర విషాదం నెలకొన్నది.
Bypoll : బీజేడీ ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి మరణంతో ఉపఎన్నిక
2019 ఎన్నికల్లో పిపిలీ నియోజకవర్గం నుంచి బీజేడీ నేత ప్రదీప్ మహారథి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే… ఆయన ఇటీవల మరణించడంతో అక్కడ ఉపఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 ఎన్నికల్లో ప్రదీప్ చేతిలో ఓడిపోయిన అజిత్ మంగరాజుకే కాంగ్రెస్ పార్టీ మరోసారి టికెట్ కేటాయించింది. అయితే… అజిత్ కరోనాతో మృతి చెందడంతో ఉపఎన్నికను కూడా ఈసీ వాయిదా వేసింది. త్వరలోనే ఉపఎన్నిక తేదీలను ప్రకటిస్తామని…. కాంగ్రెస్ పార్టీ నుంచి మరో అభ్యర్థికి నామినేషన్ కు అవకాశం కల్పిస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు.