Congress : ఒకప్పుడు ఇందిరా గాంధీకే తప్పలేదు.. ఇప్పుడు రెడ్డి నేతల మధ్య వర్గ పోరు ఎంత దూరం తీసుకెళ్లనుంది?
Congress : అవును.. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి చూస్తే రెంటికి చెడ్డ రేవలా తయారైంది. కాంగ్రెస్ పార్టీ కోటలే తెలంగాణలో బద్దలు అయ్యే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాదు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది రెడ్డి నేతలే. రెడ్డి సామాజిక వర్గం నుంచే ఎక్కువ మంది నేతల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పదవులు అనుభవించారు. కానీ.. ఇప్పుడు ఆ రెడ్డి నేతల మధ్య వర్గ పోరు ప్రారంభం అయింది. అదే ఇప్పుడు పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంలో పడేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ చాలా పాత పార్టీ. చాలా ఏళ్ల నుంచి పార్టీలో ఉండి.. పలు పదవులు అనుభవించిన వాళ్లు, కొత్తగా పార్టీలో చేరే వాళ్లు వీళ్ల మధ్య జరిగే అంతర్గత పోరు వల్ల చివరకు పార్టీ నాశనం అవుతోంది తప్పితే ఇంకేం జరగడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీ, తెలంగాణలో ఎలా తయారైందో అందరికీ తెలిసిందే. తెలంగాణను మేమే ఇచ్చాం అని కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోయింది. దీంతో తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని 2014 లో ఘోరంగా ఓడించారు తెలంగాణ ప్రజలు.
Congress : కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారమే హాట్ టాపిక్
కాంగ్రెస్ పార్టీలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటి వరకు చాలా పదవులను చేపట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వాళ్లకు చాలా ఫాలోయింగ్ ఉంది. కానీ.. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారమే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత నుంచి పార్టీలో పరిస్థితులన్నీ మారిపోయాయి. అవన్నీ పక్కన పెడితే.. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ లో పట్టం కట్టడాన్ని చాలామంది సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోయారు. చంద్రబాబు రైట్ హ్యాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఏకంగా కాంగ్రెస్ చీఫ్ ను చేయడంపై కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా తట్టుకోలేకపోయారు. అప్పట్లోనే ఇందిరా గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి సస్పెండ్ చేయడంతో 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వీడిపోయి ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ గా పోటీ చేయాల్సి వచ్చింది.
వైఎస్సార్ మరణం తర్వాత కూడా అలాంటి సీనే రిపీట్ అయింది.ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కానుందనే వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించడంతో.. ఆ పార్టీలో ఉన్న రెడ్డి నేతలు అందరూ బయటికి వచ్చేస్తున్నారు. ఉత్తమ్ తర్వాత కోమటిరెడ్డికి అవకాశం వస్తుందని అందరూ భావించినా అది జరగలేదు. చివరకు వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్ కు పగ్గాలు అప్పగించారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రమే కాదు.. చాలామంది నేతలకు ఇది నచ్చలేదు. దీంతో రెడ్డి నేతల మధ్యే వర్గ పోరు ప్రారంభం అయింది. చివరకు కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడేలా చేసింది. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ తర్వాత ఇంకా ఎంతమంది కాంగ్రెస్ ను వీడుతారో? చివరకు కాంగ్రెస్ పరిస్థితి ఏమౌతుందో అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు.