Cooking Oil : పండగలు వస్తున్న తరుణంలో సామాన్య ప్రజలకు భారీ షాక్..
Cooking Oil Prices Hike : పండుగ సీజన్‌కి ముందు సామాన్యులకి షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు దగ్గర పడుతుండటంతో ఇంటింటా పిండివంటలు చేయడం, అతిథులకు కొత్త వంటకాలు రుచి చూపించడం సహజం. కానీ ఈ సీజన్‌లో వంట నూనెల ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశం తన అవసరాలకు దాదాపు 60% నూనెను దిగుమతులపై ఆధారపడటం, ప్రపంచ మార్కెట్‌లో ధరల మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు వినియోగదారుల జేబుకు భారంగా మారుతున్నాయి.
cooking oil prices hike
ఏడబ్ల్యూఎల్ అగ్రి సీఈవో అంగ్షు మల్లిక్ ప్రకారం, ప్రస్తుతం వంట నూనెల సరఫరా స్థిరంగా ఉన్నప్పటికీ, ధరల విషయంలో మాత్రం ఒత్తిడి తప్పదని తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం వంట నూనెల వినియోగం 7-8% పెరిగినా, గతేడాది కేవలం 1-1.5% వృద్ధి మాత్రమే నమోదైంది. పట్టణ మధ్యతరగతి, గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ మందగించడం కూడా దీనికి కారణమని చెప్పారు. అయితే ఇటీవల గ్రామీణ మార్కెట్ల నుండి కొంత పాజిటివ్ స్పందన వస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశం స్వయం సమృద్ధి దిశగా ఆవాల నూనె ఉత్పత్తి పెంచడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆవాల విత్తనాల్లో 40% నూనె పాళ్లు ఉండటంతో ఉత్పత్తిని విస్తరించడం సులభమని చెబుతున్నారు. ఇప్పటికే ఆవాల నూనె ధర సోయాబీన్ నూనె కంటే కిలోకు రూ.40 ఎక్కువగానే ఉన్నా, వినియోగం పెరుగుతోందని సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో పామ్ ఆయిల్ ధర రూ.130కి పైగా చేరింది. ఈ నేపథ్యంలో రాబోయే పండుగ సీజన్‌లో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు అదనపు భారాన్ని మోసే పరిస్థితి ఏర్పడనుంది.