ఏపీలో ఒక్క కాలేజీలో ఒకే రోజులో 163 మందికి కరోనా
AP corona : ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర అలజడిని సృష్టిస్తుంది. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజమండ్రి సమీపంలోని ఓ కళాశాలలో 163 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు అలర్టయ్యారు. మరోవైపు సీఎం జగన్ కూడా పెరుగుతున్న కేసులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై సమీక్షిస్తున్నారు. అయితే అన్ని కళాశాలలు పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 700 మంది విద్యార్థుల నమూనాలు సేకరించారు.
ఆ కాలేజీలో రెండు రోజులుగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మొదటి రోజు కొందరు విద్యార్థులను టెస్ట్ చేస్తే 13 కేసులు బయటపడ్డాయి. రెండో రోజు 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య తగ్గిందిలే అని ఆ కాలేజీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కానీ ఒక్క రోజే 140 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ కావటంతో ఏపీ ఉలిక్కిపడింది. కరోనా సోకినా వాళ్ళను ఒక క్యాంపస్ లో ఉంచి దానిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. అదే కాలేజీలోని మరో 450 మంది మందిని వేరే హాస్టల్ కు తరలించినట్టు వివరించారు.
అంతేకాక రాజమండ్రిలోని ఓ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో రాష్ట్రంలో 310 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 894044కి చేరింది. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా సోకి గత 24 గంటల్లో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లాలో ఒకరు కృష్ణాలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 7191 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 114 మంది పూర్తిగా కోలుకోగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 884471కి చేరింది.
రాష్ట్రం లో ప్రస్తుతం 2382 యాక్టివ్ కేసులున్నాయి. అయితే కొత్త కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అనంతపురంలో 26 చిత్తూరులో 51 తూర్పు గోదావరి లో 43 గుంటూరు లో 28 కడప లో 20 కృష్ణా లో 26 కర్నూలు లో 21 నెల్లూరు లో 13 ప్రకాశం లో 12 శ్రీకాకుళం లో 20 విశాఖపట్నం లో 43 విజయనగరంలో 7 కొత్త కేసులు నమోదయ్యాయని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పక్రియ జరుగుతున్నా కానీ కొత్త కేసులు నమోదు కావటం ఆందోళన కలిగించే విషయం.