Cricketer | మాజీ క్రికెటర్ రాజేష్ బానిక్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.. క్రికెట్ లోకం షాక్!
Cricketer | భారత క్రికెట్‌లో ఒకవైపు మహిళల జట్టు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన ఆనందం నెలకొనగా, మరోవైపు క్రికెట్ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. త్రిపురకు చెందిన మాజీ క్రికెటర్, అండర్-19 వరల్డ్‌కప్ క్రీడాకారుడు రాజేష్ బానిక్ (40) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పశ్చిమ త్రిపురలోని ఆనందానగర్ వద్ద జరిగిన ఈ దుర్ఘటన క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది.
#image_title
వివరాల్లోకి వెళ్తే — రాజేష్ బానిక్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, వెంటనే అగర్తలాలోని జీబీపీ ఆసుపత్రికి తరలించబడ్డారు. అయితే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి వార్తతో త్రిపుర క్రికెట్ వర్గాలు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ బానిక్ తన కెరీర్‌లో ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు వంటి ప్రముఖ ఆటగాళ్లతో కలిసి భారత అండర్-19 జట్టులో ప్రాతినిధ్యం వహించారు. రంజీ ట్రోఫీలో త్రిపుర తరఫున ఆడిన బానిక్, రాష్ట్రంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకరుగా పేరుపొందారు.
త్రిపుర క్రికెట్ అసోసియేషన్ (TCA) ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించింది. TCA కార్యదర్శి సుబ్రతా డే మాట్లాడుతూ — “ఒక ప్రతిభావంతుడైన క్రికెటర్‌ను, అండర్-16 జట్టు సెలక్టర్‌ను కోల్పోవడం చాలా బాధాకరం. ఈ వార్త తెలిసి మేము తీవ్ర షాక్‌కు గురయ్యాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అన్నారు. రాజేష్ బానిక్ ..
ఫస్ట్‌క్లాస్ క్రికెట్: 42 మ్యాచ్‌లు, 1469 పరుగులు, 2 వికెట్లు
లిస్ట్-ఎ మ్యాచ్‌లు: 24, 378 పరుగులు, 8 వికెట్లు
టీ20లు: 18, 203 పరుగులు
ఆయన చివరిసారిగా 2018లో ఒడిశాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో త్రిపుర తరఫున ఆడారు.