whatsapp : వాట్సప్ సరికొత్త ఫీచర్ తో సైబర్ మోసాలు.. జాగ్రత్తగా ఉంటే సరి లేకపోతే బ్యాంకు ఖాతా ఖాళీయే..!
whatsapp : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ ను వాడుకుని చోరీ లు చేస్తున్నారు. తేరగా వచ్చి… మాయ మెసేజ్ లతో నమ్మించి అందిన కాడికి దోచుకు పోతున్నారు. యూజర్స్ వాట్సాప్ అందుబాటులోకి తీసుకు వచ్చిన సరికొత్త ఫీచర్ ఇప్పుడు వీరికి అడ్డాగా మారుతోంది. ఈ నయా ఫీచర్ పై జాగ్రత్తగా ఉండకపోతే మీ బ్యాంక్ ఖాతాలు కూడా ఖాళీ అవడం ఖాయం.వాట్సప్ తాజాగా నగదు చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. చాటింగ్ చేసే చోటే డబ్బులు పంపుకునే సదుపాయం కూడా ఉండడంతో వాట్సాప్ ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెర తీశారు.
వాట్సాప్‌లో ప్రెండ్ ఇన్ నీడ్ పేరుతో నయా దందాను షూరు చేశారు. తాజాగా ఈ మోసం బ్రిటన్‌లో వెలుగు చూసింది . మొదటగా ఈ సైబర్ స్కామ్ వాట్సప్ లో ఓ మెస్సేజ్‌తో ప్రారంభమవుతుంది. సైబర్ నేరగాళ్లు ముందుగా… హలో మమ్ లేదా హలో డాడ్ అని యూజర్ కి సెండ్ చేస్తారు. మీ కొడుకు లేదా కూతురు ఇబ్బందుల్లో ఉన్నారంటూ.. అత్యవసరంగా వారికి డబ్బు కావాలని అడుగుతారు. లేదా ఫోన్ పోయిందని ఫ్రెండ్ ఫోన్ తో మెసేజ్ చేస్తున్నానని చెబుతూ కొత్త ఫోన్ కోసం డబ్బు కావాలంటూ వాట్సాప్ లింక్ ద్వారా మనీ కోరతారు. ఇదంతా నమ్మిన పేరెంట్స్ వారు అడిగిన కాస్త డబ్బు లింక్ ద్వారా పే చేస్తారు. లింక్ ను పట్టుకున్న సైబర్ నేరగాళ్లు… దానితో ఆ ఎకౌంట్ లోని పూర్తి నగదును స్వాహా చేసేస్తారు.
WhatsApp : హలో మమ్.. హలో డాడ్ అంటూ సైబర్ మోసాలు:
ఇదే విధంగా యూ.కే లో కేవలం కొన్ని నెలల్లోనే అక్కడి ప్రజల ఖాతాల నుంచి £50,000 వరకు నగదును కొట్టేశారు. అలాగే గత ఆగస్టు నుంచి అక్టోబర్ 25 మధ్య ఇటువంటి సైబర్ మోసాల ద్వారా £48,356 వరకు స్వాహా చేసినట్లు సమాచారం. పలు దేశాల్లో ఇప్పటికే ఇలా లక్షలాది పౌండ్లు పోగొట్టుకున్న ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయట. ఆ డబ్బు తన వాళ్లకు వెళ్లలేదని… సైబర్ నేరగాళ్లు మోసం చేశారని తెలుసుకున్న వారంతా ఆ తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారట. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. ముందే జాగ్రత్తగా ఉండాలి కదా. అర్థం అయిందా ఈ వాట్సప్ చెల్లింపుల విషయంలో ఫేక్ మెసేజ్ ల పట్ల మీరూ జాగ్రత్తగా ఉంటే సరి. లేకపోతే ఇక అంతే సంగతులు.