8th pay commission : ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..8వ వేతన సంఘంపై కేంద్రం కుండబద్దలు
8th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు తెలిపారు. భారత ప్రభుత్వం వద్ద 8వ వేతన సంఘం విషమై ఎలాంటి ప్రతిపాదన లేదని వివరణ ఇచ్చారు. లోక సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. 2026 జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయనుందా? అనే ప్రశ్నకు పంకజ్ చౌదరీ లోక్‌సభలో సమాధానమిస్తూ.. 8వ కేంద్ర వేతన సంఘం ప్రతిపాదన లేదని తెలిపారు. అలాగే ఉద్యోగులపై ద్రవ్యోల్బణ ప్రభావం అంశంపై గురించి ఆయన వివరణ ఇచ్చారు. ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగుల జీతాల వాస్తవ విలువలో కోతను భర్తీ చేయడానికి డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
8th Pay Commission : పెద్ద షాకే..!
8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయబోమని ప్రకటించడం ద్వారా రాబోయే కాలానికి కూడా 7వ వేతనం సంఘం సిఫార్సులనే అమలు చేయనున్నట్లు మోదీ సర్కార్ సంకేతాలిచ్చినట్లయింది. అయితే, ప్రస్తుత కాలానికి 7వ పే కమిషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కాలేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడు పే కమీషన్లు ఏర్పాటయ్యాయి. ఆర్థిక శాఖ పరిధిలో వ్యవహరించే పే కమిషన్లు.. ప్రతి పదేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్ సవరించేందుకు నిర్దేశించారు. చివరిగా 7వ కేంద్ర వేతన సంఘాన్ని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కాలేదనే ఆరోపణలున్నాయి.
ఇకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ పెంపు గురించి వేచి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశాన్ని వెల్లడించాల్సి ఉంది. డీఏ పెంపు ప్రతి ఏటా రెండు సార్లు ఉంటుంది. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల నుంచి డీఏను సవరిస్తూ వస్తుంది. త్వరలోనే కేంద్రం డీఏ పెంపును ప్రకటించొచ్చు. తొలి వేతన సంఘం 1946లో ఏర్పాటైంది.