Dalit Bandhu : తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. అన్ని నియోజకవర్గాల్లో ‘దళిత బంధు’..!
Dalit Bandhu : తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పైలట్ ప్రాజెక్టు కింద ఆ నియోజకవర్గంలో అమలు చేసిన ‘దళిత బంధు’ పథకాన్ని తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘దళిత బంధు’ పథకం అమలు అన్ని నియోజకవర్గాల్లో ఉండబోతున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
Dalit Bandhu :ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు..
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ‘దళిత బంధు’ పథకం అమలును వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఇందుకుగాను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాగా, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, బీ.ఆర్.కె ఆర్ భవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 118 శాసన సభ నియోజక వర్గాల్లో ‘దళితబంధు’ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ నియోజక వర్గంలో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.