Warangal : అక్కడ దండెమ్మ బోనాల జాతరే స్పెషల్.. భక్తుల కొంగు బంగారం దండెమ్మ
Warangal : మామూలుగా బోనాల జాతర సాధారణంగా ముత్యాలమ్మ, మాంకాలమ్మలకు చేస్తారు. కానీ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో మాత్రం దండెమ్మకు బోనాలు చేస్తారు. అందుకే.. అక్కడి బోనాలను దండెమ్మ బోనాల జాతర అని పిలుస్తారు.
ఆ ఊరిని దండెమ్మ అనే దేవత కాపాడుతోంది. అందుకే.. దండెమ్మకు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బోనాలు నిర్వహిస్తారు. దండెమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి.. వస్త్రాలతో మొక్కులు చెల్లిస్తారు. అయితే.. దండెమ్మ తల్లికి ప్రతి ఆడపడుచు.. రెండు కొంగుల చీరను సమర్పిస్తుంది. అదే ఇక్కడ ఆనవాయితీ. దండెమ్మనే దండి దేవర అని పిలుస్తారు.
అమ్మవారి కోసమే ప్రత్యేకంగా రెండు కొంగుల చీరను నేస్తారు. పద్మశాలీలు ఆ చీరను నేసి తల్లికి సమర్పిస్తారు. తర్వాత సాయంత్రం ఎడ్ల బండి జాతర ఉంటుంది. మేకపోతులతో బండి తయారు చేసి.. ఆ బండిని దండెమ్మ గుడి చుట్టూ తిప్పుతారు. రాత్రిపూట.. పోతరాజులు విన్యాసాలు చేస్తారు.