Nara Lokesh : నారా లోకేష్‌కీ బ్రాహ్మణికీ మధ్య గొడవలున్నాయా.?
Nara Lokesh : ‘భారతమ్మను విమర్శిస్తే, వైసీపీ ఎలాగూ బ్రాహ్మణిపై విమర్శలు చేస్తుంది కాబట్టి, ఆ కోణంలో తన భార్య బ్రాహ్మణి మీద కోపం తీర్చుకోవాలని నారా లోకేష్ అనుకుంటున్నారేమో.! మేం ఆ స్థాయికి దిగజారం. వైఎస్ జగన్ సతీమణి భారతమ్మపై విమర్శలు చేయొద్దు. ఆమె ప్రజా జీవితంలో లేరు. ఎప్పుడూ ఆమె వివాదాల జోలికి వెళ్ళరు.. బ్రాహ్మణితో మీకు ఏమైనా గొడవలుంటే మీ నాన్నతో సంప్రదించండి, మీ మావయ్య బాలకృష్ణతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోండి..’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మంత్రి గుడివాడ అమర్నాథ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి ఉచిత సలహా ఇచ్చారు.
ఇటీవల నారా లోకేష్ మాట్లాడుతూ, వైఎస్ భారతికి వాటాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ విషయమై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నారా లోకేష్ డైటింగ్ చేస్తే ఒళ్ళు తగ్గడంలేదుగానీ.. బుర్ర తగ్గుతోంది.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు పలువురు వైసీపీ నేతలు.రాజకీయాలన్నాక విమర్శలు మామూలే కావొచ్చుగానీ, కుటుంబ సభ్యుల్ని వివాదాల్లోకి లాగడమేంటి.? వైఎస్ షర్మిల మీదా, వైఎస్ విజయమ్మ మీదా టీడీపీ నానా యాగీ చేసింది గతంలో. అయితే, జనం ఈ విషయంలో టీడీపీని పట్టించుకోలేదు సరికదా, ‘ఇదేం పద్ధతి.?’ అంటూ టీడీపీకి గడ్డి పెట్టే పరిస్థితి వుంది. 2024 ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలనే కసి టీడీపీకి వుండడం సహజమే కావొచ్చు. కానీ, అందుకు చేయాల్సింది వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల్ని రచ్చకీడ్చడం కాదు. పార్టీ పటిష్టత కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకోవాలి.
చేతనైతే, తండ్రి చంద్రబాబుకి తనయుడు నారా లోకేష్ సహకరించాలి. అవి మానేసి, వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల మీద తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేస్తే ఏం లాభం.? ఇందుకే, 2019 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతయ్యింది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడిందిప్పుడు. కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోక తప్పదని వైసీపీ బల్లగుద్ది చెబుతున్న వేళ, ఈసారైనా మంగళగిరి నుంచి గెలవడం కోసం నారా లోకేష్ నానా తంటాలూ పడుతున్నారు. ఈ క్రమంలోనే అసహనానికి గురవుతున్నారన్నమాట. ఇంతకీ, బ్రాహ్మణి – నారా లోకేష్ మధ్య వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే గొడవలున్నాయా.? ఈ విషయమై లోకేష్ స్పష్టత ఇస్తారా.? బాలయ్య స్పందించాల్సి వుంటుందా.? చంద్రబాబు ఇంకోసారి ‘కంటతడి’ పెట్టబోతున్నారా.? వేచి చూడాల్సిందే.