Dropout Chaiwala : టీ, కాఫీలు అమ్ముతూ ఏడాదికి రూ.5 కోట్లు సంపాదించిన కాలేజీ డ్రాపవుట్ స్టూడెంట్.. ఎలా సాధ్యం అయిందంటే?
Dropout Chaiwala : చదువుకుంటేనే మంచి జాబ్ వస్తుందా? మంచి జాబ్ వస్తే మంచిగా సంపాదించవచ్చు. ఇదే కదా.. అందరూ చెప్పేది. చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు.. మంచిగా చదువుకో అంటూ పిల్లలకు పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుందని కూడా చెబుతారు. చదువుకోకపోతే ఏ పని చేయలేమని కూడా అంటారు. కానీ.. కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే చదువుతో సంబంధం లేకపోయినా జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు ఓ కుర్రాడు. అది మన తెలుగు కుర్రాడే. నెల్లూరుకు చెందిన ఆ కుర్రాడు ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుదామని అనుకున్నాడు. అక్కడికి వెళ్లాడు కానీ.. మధ్యలోనే తిరిగి వచ్చేశాడు. దానికి కారణం..
ఏదైనా వ్యాపారం చేయాలని అనుకోవడమే. అతడికి వచ్చిన ఆలోచనను కార్యరూపం దాల్చాడు. సక్సెస్ అయ్యాడు. ఆస్ట్రేలియాలో బీబీఏ చదవడానికి సంజిత్ అనే నెల్లూరుకు చెందిన కుర్రాడు వెళ్లాడు కానీ.. అక్కడ అతడికి చదువు అబ్బలేదు. కాలేజీ డ్రాప్ అవుట్ గా మారాడు. కాలేజీ డ్రాపవుట్ అవడంతో తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలి అనిపించింది. ఓడిపోయి ఇండియాకు తిరిగి వెళ్లలేక తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. అక్కడే ఆస్ట్రేలియాలో డ్రాపవుట్ చాయ్ వాలా అనే ఓ టీ స్టాల్ ను తెరిచాడు. తాను చదువు వదిలేసి టీ కొట్టు పెట్టుకున్నాను అని తన తల్లిదండ్రులకు చెబితే ముందు బాధపడ్డారు. కానీ.. ఇప్పుడు తను ఒక స్థాయిలో ఉండటంతో అతడిని చూసి తల్లిదండ్రులు గర్విస్తున్నారు.
Dropout Chaiwala : టీ మీద ఉన్న ఇష్టంతోనే ఆస్ట్రేలియాలో టీ కొట్టు పెట్టి విజయం సాధించిన సంజిత్
నిజానికి సంజిత్ కు టీ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి టీ అంటే ఉన్న ఇష్టంతో ఆస్ట్రేలియాలో టీ షాప్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. వెంటనే ఓ ఎన్ఆర్ఐని ఒప్పించి పెట్టుబడి పెట్టించాడు. ఒక ఏడాదిలోనే రూ.5.2 కోట్ల లాభం వచ్చింది సంజిత్ కు. నిజానికి ఆస్ట్రేలియాలో కాఫీ ఎక్కువగా తాగుతారు. కానీ.. సంజిత్ చేసే చాయ్ కు మెల్ బోర్న్ వాసులు ఫిదా అయిపోయారట. అతడి టీ కొట్టులో చాయ్ విత్ సమోసా, చాయ్ విత్ పకోడాలు చాలా ఫేమస్ అట. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇండియన్స్ కూడా ఖచ్చితంగా మనోడి చాయ్ ను రుచి చూడనిదే వెళ్లరట.