Dunit | తండ్రి మరణం అనంతరం తిరిగి జట్టులోకి.. శోకాన్ని జయించి మళ్లీ క్రికెట్ మైదానంలోకి
Dunit | శోకాన్ని జయించి మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు శ్రీలంక యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే. తండ్రి సురంగ వెల్లలాగే గుండెపోటుతో మృతి చెందడంతో హుటాహుటిన స్వదేశానికి వెళ్లిన దునిత్, తండ్రి అంత్యక్రియలలో పాల్గొని మళ్లీ యూఏఈ చేరుకున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా గురువారం అబుదాబిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ సమయంలోనే ఈ విషాదవార్త జట్టుకు అందింది. మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ సనత్ జయసూర్య, టీమ్ మేనేజర్ కలిసి ఈ వార్తను దునిత్‌కు తెలిపారు. వెంటనే వెల్లలాగే శ్రీలంకకు వెళ్లి తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు.
#image_title
జయసూర్య భావోద్వేగ పోస్ట్
తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో, దునిత్ వెల్లలాగే నేడు బంగ్లాదేశ్‌తో జరగనున్న సూపర్ ఫోర్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో దునిత్‌కు ఆధారంగా నిలిచిన జయసూర్య సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.సురంగ వెల్లలాగే మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. దేశం గర్వపడే కొడుకును పెంచిన గొప్ప తండ్రి ఆయన. దునిత్, నీ తండ్రి కూడా ఒక క్రికెటర్.
ఆయన ఆశయాలు, క్రీడపై ఆయనకున్న ప్రేమ నీలో ఎప్పటికీ జీవిస్తూ ఉంటుంది. నువ్వు ఒంటరివి కాదు. నేను నీకు తండ్రిలా అండగా ఉంటాను. జట్టు, దేశం నీ వెంటే ఉంది,” అని జయసూర్య ట్వీట్ చేశారు. కాగా, భారత్‌పై రెండుసార్లు ఐదు వికెట్ల హాల్ సాధించడం ద్వారా అంతర్జాతీయ మాద్యమాల్లో కూడా దృష్టిని ఆకర్షించాడు వెల్లలాగే. ప్రస్తుతం ఆసియా కప్‌లో శ్రీలంక జట్టు ఫుల్ ఫామ్ లో ఉంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్ ఫోర్ దశలో బంగ్లాదేశ్‌తో తలపడనున్న ఈ మ్యాచ్‌కు దునిత్ చేరిక మరింత బలాన్ని ఇస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.