Oil prices : గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు.. సామాన్యుడికి ఊరట..!
దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు మండిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుడికి ఊరట కలిగించే దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వంట నూనెల ధరలను తగ్గించేందుకుగానూ అన్ని శుద్ధి చేసిన నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఫలితంగా మార్కెట్లలో గత వారం సోయాబీన్ నూనె ధరలు క్షీణించాయి. ఈ మేరకు ఇది ఇతర నూనెల ధరలపై కూడా ప్రభావం చూపనుందని వ్యాపారులు అంటున్నారు.
వేరుశెనగతో పాటు శెనగ నూనె ధరలు గతంతో పోలిస్తే తగ్గినట్లు చెబుతున్నారు. శీతాకాలంలో సాధారణంగా క్రూడ్ పామాయిల్‌కు డిమాండ్ తక్కువగా ఉంటుందని.. అందుచేత పామాయిల్ ధర కూడా తగ్గిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నారు. దిగుమతి సుంకం తగ్గించడమే ఈ ధరల తగ్గింపుకు కారణమంటున్నారు. మరోవైపు కేంద్రం.. వంట నూనెల ధరలు తగ్గించేందుకు 2022 మార్చి వరకు శుద్ధి చేసిన పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది.
ఇది కాక.. ముడి పామాయిల్‌తో సహా అనేక వ్యవసాయ వస్తువుల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లలో వాణిజ్యాన్ని ఏడాది పాటు నిలిపివేసింది. వంట నూనెల ధరలపై.. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి విమర్శలు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.