Huzurabad Padayatra : పాదయాత్రలో ఈటల రాజేందర్ కు అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు
Huzurabad Padayatra : ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఫీవర్ నడుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికలు వేడెక్కాయి. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్.. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ పాదయాత్ర చేస్తుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రజా దీవెన యాత్ర పేరుతో ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామాన్ని సందర్శించి.. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఉపఎన్నిక ప్రచారం ముగిసే వరకు ఆయన పాదయాత్ర సాగనుంది.
చాలా రోజుల నుంచి ఆయన విరామం లేకుండా పాదయాత్ర చేస్తుండటంతో ఇవాళ ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాదయాత్రను వాయిదా వేశారు. ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో పాటు.. కాళ్లనొప్పులు ఉండటంతో ఆయన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు.. బీజేపీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి ప్రకటించారు.
Huzurabad Padayatra : కొండపాక గ్రామంలో పాదయాత్ర చేస్తుండగా అస్వస్థత
వీణవంక మండలం.. కొండపాక గ్రామంలో పాదయాత్ర చేస్తుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయన షుగర్ లేవల్స్ పెరగడంతో పాటు.. బీపీ పడిపోయింది. అలాగే.. ఆక్సిజల్ లేవల్స్ కూడా పడిపోవడంతో ఆయనకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి.. హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఈటలను హైదరాబాద్ లోని నిమ్స్ లో చేర్చారు. ఆయన ఆరోగ్యం కుదుట పడేవరకు.. ఈటల బదులుగా ఆయన భార్య జమున పాదయాత్ర కొనసాగిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటి వరకు ఈటల రాజేందర్ సుమారు 220 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈనెల 19 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం నుంచి ప్రజా దీవెన యాత్రను ప్రారంభించారు.