Etela Rajender : కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.. ఈటల అసలు ప్లాన్ అదేనట?
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలన్నీ రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. దానికి కారణం ఈటల రాజేందర్. ప్రస్తుతం ఈటల రాజేందర్ కార్నర్ అయిపోయారు. ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి ఆయన. దశాబ్దాల నుంచి తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. భూకబ్జా ఆరోపణలతో సీఎం కేసీఆర్.. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు.
తన ఎమ్మెల్యే పదవికి అయితే రాజీనామా చేయలేదు కానీ.. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నేతలను ఈటల కలుస్తున్నారు. వాళ్లతో భేటీ అవుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనూ ఆయన భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలతోనూ ఈటల భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే.. తనతో ఈటల ఇప్పటి వరకు భేటీ కాలేదని.. కలవాలని కబురు పంపిన మాట మాత్రం వాస్తవమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Etela Rajender : ఈటల నన్ను కలిస్తే తప్పేంటి?
మేమిద్దరం గతంలో కలిసి పనిచేశాం. ఆయన నన్ను కలవాలని అనుకుంటే దాంట్లో తప్పేంటి? ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించాక.. ఇప్పటి వరకు ఈటలను నేను కలవలేదు. భవిష్యత్తులో కలిస్తే కలవొచ్చు. ఈటల ఒకవేళ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. హుజూరాబాద్ లో ఉపఎన్నిక వస్తే.. అక్కడ బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపాలా? వద్దా? అనే విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇంకా దానిపై పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.. అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడంతో.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఉపఎన్నిక వస్తే.. అభ్యర్థిని బరిలోకి దింపాలా? వద్దా? అని ఆలోచిస్తాం అని కిషన్ రెడ్డ అంటున్నారంటే… ఇక్కడ ఏదో జరుగుతోంది.. వీళ్ల మధ్య ఏదో ఉంది. ఈటల ఉపఎన్నిక బరిలో దిగితే.. ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల అభ్యర్థులను బరిలోకి దింపొద్దని.. తాను ఇండిపెండెంట్ గా హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని.. దయచేసి.. ఈ ఉపఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని.. ఈటల కాంగ్రెస్, బీజేపీ నేతలను రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే.. కిషన్ రెడ్డి అలా వ్యాఖ్యానించారు అనే వార్తలు వస్తున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభ్యర్థిని బరిలోకి దింపితే.. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపకపోతే.. గెలుపు తనదే అవుతుందని.. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పినట్టు అవుతుందని ఈటల ఆయా పార్టీలతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తుంది. మరి.. అది నిజమా? అబద్ధమా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.