Gandhi Hospital | కుటుంబ కలహాలతో బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్..శస్త్ర చికిత్స లేకుండానే రికవరీ చేసిన గాంధీ వైద్యులు
Gandhi Hospital | సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఒక అరుదైన విజయాన్ని సాధించారు. కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనైన మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ ఖాజా (37), 8 షేవింగ్ బ్లేడ్లను రెండు ముక్కలుగా విరిచిపోయి మొత్తం 16 ముక్కలుగా చేసి మింగిన ఘటన సంచలనం రేపింది. బాధితుడు తీవ్ర కడుపు నొప్పితో విలవిలలాడడంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 16న అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

#image_title
వైద్యుల అద్భుత చికిత్స
జనరల్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే స్పందించి, ఎక్స్‌రే మరియు సీటీ స్కాన్ ద్వారా ఖాజా పొట్టలో బ్లేడ్ ముక్కలు ఉన్నట్టు గుర్తించారు. ప్రారంభంలో ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేసినా, ఆ ప్రక్రియలో అన్నవాహిక, ఇతర అవయవాలకు గాయాలు, రక్తస్రావం అయ్యే అవకాశం ఉండటంతో శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేయాలని నిర్ణయించారు.
వైద్య బృందం ‘నిల్ ఫర్ ఓరల్’ (ఆహారం, నీరు లేకుండా) పద్ధతిలో, ప్రోటాన్ పంప్ థెరపీ ఉపయోగించి ఇంట్రావీనస్ (IV) ద్రావణాలు మాత్రమే అందిస్తూ బ్లేడ్లు సహజంగా మల విసర్జన ద్వారా బయటకు వచ్చేలా చేశారు. మొదటి రోజు: కొంత భాగం బయటకు వచ్చింది, రెండవ రోజు: 90% బ్లేడ్లు కడుపులో కిందకు జారిపోయాయి, మూడవ రోజు: మిగతా బ్లేడ్లు పూర్తిగా మల విసర్జనలో వెలువడినట్లు వైద్యులు తెలిపారు.చివరగా, మరోసారి ఎక్స్‌రే చేసి బ్లేడ్ ముక్కలు పూర్తిగా బయటపడ్డాయని నిర్ధారించుకున్న తర్వాత ఖాజాను డిశ్చార్జ్ చేశారు.