TGSRTC | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు దసరా సందడి ..యాజమాన్యం నుంచి అడ్వాన్స్ గుడ్‌న్యూస్
TGSRTC | దసరా పండుగ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ఉద్యోగులకు శుభవార్త. పండుగకు ముందస్తుగా ఖర్చుల నిర్వహణకు గాను అడ్వాన్స్ అందజేయాలని ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, శ్రామిక్‌లు సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సౌకర్యం లభించనుంది.

#image_title
అడ్వాన్స్ అమౌంట్..
ఉద్యోగుల నెల జీతాన్ని ఆధారంగా చేసుకొని అడ్వాన్స్ అమౌంట్ నిర్ణయించనున్నారు. అనంతరం, ఈ మొత్తం ఆయా ఉద్యోగుల వేతనాల్లో నుంచి నెలవారీగా కట్ చేసి తిరిగి వసూలు చేయనుంది. ఈ మేరకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అధికారులతో సమావేశమై ఆమోదం తెలిపారు. సంబంధిత అధికారులకు అడ్వాన్స్ ఇవ్వాలని ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పండుగల సమయంలో బోనస్ ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇటీవల యాజమాన్యాన్ని పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్‌ను లాభాల బాటలో నడిపిస్తూ, మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వామ్యం కావడాన్ని ఉద్యోగులు ప్రస్తావించారు. వారి అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ అడ్వాన్స్ ద్వారా ఉద్యోగులకు దసరా పండగ మరింత ఆనందంగా ఉండే అవకాశముందని అంచనా.