Ys jagan : వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన రెండ్రోజులకే కేంద్రం గుడ్ న్యూస్!
Polavaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.320 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిని 2021–22 బడ్జెట్‌లో కేంద్ర జల్ శక్తి శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి విడుదల చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం పీపీఏ అకౌంట్‌లో ఈ నిధులు జమ కానున్నాయి. అనంతరం శుక్రవారం వరకు ఏపీ ఖజానాలో నిధులు యాడ్ కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసి వచ్చిన రెండ్రోజుల్లోనే కేంద్రం ఈ మేరకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పోలవరం పనులు 90 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో భాగంగా నేషనల్ ప్రాజెక్టుగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. 2014 ఏప్రిల్ 1న నీటి పారుదల విభాగం ఖర్చు మొత్తాన్ని 100 శాతం రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,372.14 కోట్లు ఖర్చు చేయగా, అందులో 2014 ఏప్రిల్ 1 తర్వాత చేసిన వ్యయం రూ.13,641.43 కోట్లుగా ఉంది. కేంద్రం నేటికీ రూ.11,492.16 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇంకా రూ.2,149.27 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. పోలవరం కోసం ఖర్చు చేసిన రూ.2,149.27 కోట్ల బిల్లులను అధికారులు పీపీఏకు సమర్పించారు. ప్రస్తుతం రూ.711.60 కోట్లు రీయింబర్స్ చేయాలని పీపీఏ కేంద్ర జల్ శక్తి శాఖను కోరగా, దీనికి CWC కూడా ఆమోదం తెలిపింది.
Ys jagan : త్వరలోనే మిగతా నిధులు
తొలిదశలో రూ.320 కోట్లను ఆర్థిక శాఖ మంజూరు చేయగా, మిగతా మొత్తాన్ని మంజూరు చేసే విషయంపై పరిశీలిస్తున్నారు. రూ.320 కోట్లు పోగా.. రాష్ట్రం చేసిన ఖర్చులో రూ.1829.27 కోట్లను కేంద్రం తిరిగి ఇవ్వాల్సి ఉంది. సీఎం జగన్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లి 2 రోజుల పాటు ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను నిధుల గురించి చర్చించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ రాష్ట్రానికి వచ్చిన రెండ్రోజుల్లోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.