Ys jagan : కాపు ఉద్యమం.. గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్
Ys jagan : ఆంధ్రప్రదేశ్ లో కాపు ఉద్యమం అయిదేళ్ళ క్రితం సంచలనం అనే చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపు ఉద్యమం గట్టిగా జరిగింది. టీడీపీ ప్రభుత్వాన్ని వైసీపీ గట్టిగా టార్గెట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడింది అనే చెప్పాలి. ఇక కాపుల్లో టీడీపీ మీద వ్యతిరేకత పెరగడానికి కూడా ఇది కారణమైంది.
ఇదిలా ఉంటే అప్పట్లో కాపు ఉద్యమంలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. ఆ కేసులను ఇప్పటి ప్రభుత్వం వరుసగా ఉపసంహరించుకుంటుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమం లో నమోదు అయిన కేసులను వెనక్కు తీసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. 2016 – 2019 మధ్య కాపు రిజర్వేషన్ ఉద్యమం లో నమోదు అయిన 176 పెండింగ్ కేసులను ఉపసంహరించుకుంటూ హోమ్ శాఖ తాజా ఆదేశాలు ఇచ్చింది.
తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి, ధవళేశ్వరం, అంబాజీపేట, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, గుంటూరు అర్బన్ తదితర పోలీసు స్టేషన్లలో ఏపీ పోలీస్ చట్టం, రైల్వే చట్టం కింద 329 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 153 కేసులు డిస్పోస్ అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మిగతా పెండింగ్ కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోం శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.