Harish Rao : నీ దూకుడు.. సాటెవ్వరూ.. హరీశ్ రావు దూకుడు వెనుక అసలు కారణం ఏంది?
తన్నీరు హరీశ్‌రావు. కేసీఆర్‌కు అల్లుడు. టీఆర్ఎస్ ఆవిర్భావంతో రాజకీయ అరంగేట్రం చేశారు. కేసీఆర్ డైరెక్షన్‌లో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. గులాబీ బాస్ వెన్నంటే ఉంటూ.. మామ నుంచి జిత్తులమారి వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు అన్నీ బాగా ఒంటబట్టించుకున్నారు. మామ తర్వాత మామ అంతటోడు అయ్యారు. అలాంటిది, తనయుడు కేటీఆర్ కోసం అల్లుడు హరీశ్‌ని అటకెక్కించేశారు కేసీఆర్. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు తనకు పక్కలో ఈటెలా మారిన రాజేందర్ కోసం ట్రబుల్ షూటర్‌ను అటక మీదనుంచి దించి.. బూజు దులిపి.. పదును పెట్టి.. హుజురాబాద్‌లో ప్రయోగించారు. హరీశ్ రావుఎంట్రీతో హుజురా.. వార్ మరింత రంజుగా మారింది. ఒక్క దుబ్బాక మినహా గత 20ఏళ్లలో హరీశ్‌రావుకు అప్పగించిన ఏ ఒక్క పనిలోనూ విఫలం అయింది లేదు. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను పర్‌ఫెక్ట్‌గా కంప్లీట్ చేసేందుకు తన అనుభవాన్నంతా వాడేస్తున్నారు హరీశ్‌రావు. తన పాత మిత్రుడు ఈటలకు కొత్తగా చుక్కలు చూపిస్తున్నారు.
ఈటల అనుచరులపై ఆకర్ష్.. Harish Rao
ఈటలకు అండాదండాగా ఉన్న ఆయన ప్రధాన అనుచరులను టీఆర్ఎస్‌లోకి లాగేశారు హరీశ్‌రావు. ఈటల సామాజిక వర్గానికే చెందిన, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జిల్లా సహకార బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్‌తో పాటు మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు చుక్కా రంజిత్ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలకు చెందిన పలువురు బీజేపీని వీడి కారెక్కనున్నారు.
హరీష్‌రావు ఆకస్మికంగా హుజూరాబాద్‌కు వచ్చి సింగాపురంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు వసతి గృహంలో మకాం వేశారు. హుజూరాబాద్ నియోజక వర్గానికి చెందిన ముఖ్య నాయకులతో ఆయన విడివిడిగా సమావేశమై చర్చించారు. టీఆర్‌ఎస్ నుంచి ఈటలతోపాటు బీజేపీలోకి వెళ్లిన వారి గురించి ఆరా తీశారు. ఈటల వెంట కీలకంగా ఉంటున్న.. పింగిలి రమేశ్ ముదిరాజ్, చుక్కా రంజిత్‌గౌడ్‌లపై ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీశారు. ఆ మార్నాడే వారిద్దరూ బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించేశారు. ఈ పరిణామం ఈటల రాజేందర్‌కు ఊహించని షాక్. కోలుకోలేని దెబ్బ అంటున్నారు.
పట్గు బిగించిన హరీష్ రావు Harish Rao
మరోవైపు.. హుజురాబాద్ వ్యాప్తంగా తన మనుషులను మోహరిస్తున్నారు హరీశ్‌రావు. ఒక్కో గ్రామానికి 10-15 మంది చొప్పున తన నమ్మిబంట్లకు బాధ్యతలు అప్పగించారు. స్థానిక నేతలను ప్రచారానికి వాడుకుంటూనే గ్రౌండ్ లెవల్‌లో మాత్రం తన సొంత కేడర్‌ని రంగంలోకి దించారు. స్థానికంగా ఎవరు టీఆర్ఎస్ కార్యకర్తలో, ఎవరు ఈటల అభిమానులో తెలీని కన్ఫ్యూజన్ ఉంది. గులాబీ కండువా కప్పుకున్న అనేకమంది.. ఈటల కోసం పని చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఆ అనుమానంతోనే హరీశ్‌రావు స్థానికులెవరినీ నమ్మకుండా.. సిద్ధిపేట నుంచి తన మనుషులను రప్పించి.. హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రామగ్రామాన మోహరించారని అంటున్నారు.
మొదట్లో హుజురాబాద్‌లో గెలుపు ఈజీ అని భావించిన టీఆర్ఎస్.. ఆ తర్వాత ఈటలకే ఎడ్జ్ ఉందంటూ సర్వేలో తేలడంతో ఖంగుతిన్నట్టుంది. ఆ సర్వే రిపోర్టుల తర్వాతే హరీశ్‌రావు మరింత యాక్టివ్ అయ్యారు. ఇప్పటికే దుబ్బాకతో తన ఇమేజ్‌కు దారుణమైన డ్యామేజ్ జరిగింది. హుజురాబాద్‌లో ఎలాగైన టీఆర్ఎస్‌ను గెలిపించి.. పోయిన పరువు, పరపతి తిరిగి సంపాదించుకోవాలనేది హరీశ్‌రావు కమిట్‌మెంట్. మామకు ఈటల ఓటమిని బహుమతిగా ఇచ్చి.. కేసీఆర్‌కు మరింత దగ్గర అయ్యే గోల్డెన్ ఛాన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దనే పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. మరి, హరీశ్ వ్యూహాలను ఈటల చిత్తు చేస్తారా? చిత్తైపోతారా? చూడాలి….