Harish Rao : హరీశ్ రావు.. ఈటలను, ఈటల.. హరీశ్ రావును ఎందుకు టార్గెట్ చేసినట్టు?
హుజూరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక రోజు రోజుకూ హీట్ పెంచుతోంది. ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వానికితిరుగు లేదని నిరూపించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పాటు మంత్రులు సైతం నియోజవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఆ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంపై తనదైన స్టైల్లో ఫోకస్ పెట్టారు. ఇన్నాళ్లు సొంత నియోజకవర్గం సిద్దిపేట నుంచే హుజూరాబాద్ లో పరిస్థితులను చక్కదిద్దిన మంత్రి హరీశ్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు.
హజూరాబాద్ లో పర్యటిస్తూ పార్టీలో జోష్
పెంచుతున్నారు. అయితే.. హుజూరాబాద్ లో కేవలం విమర్శలకే పరిమితం కాకుండా కొత్త వ్యూహాన్ని హరీశ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రెండు మూడు సమావేశాల్లో ఆయన డబుల్ బెడ్రూం ఇళ్లు, మహిళా సంఘాల భవనాల ప్రస్తావన తెచ్చారు. హుజూరాబాద్ ను ఈటల రాజేందర్ నిర్ల్యక్ష్యం చేశారని.. అందుకే ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఏడేళ్లుగా కట్టలేక పోయాడని విమర్శలు గుప్పించారు హరీశ్. తన సిద్దిపేట నియోజవర్గంలో ఏ ఊరికి వెళ్లినా డబల్ బెడ్రూం నివాసాలు కనిపిస్తాయని అన్నారు. ఈటల రాజేందర్ మహిళా సంఘాల భవనాలను కూడా కట్టించలేకపోయారని మండిపడ్డారు హరీశ్. ఇన్నాళ్లు తాము ఇక్కడంతా బాగానే ఉందని అనుకున్నామన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు.
మహిళా భవనాలు ఎక్కడ..
హుజూరాబాద్ లో 19 గ్రామాల మహిళలకు, టౌన్ పరిధిలో 30 వార్డుల మహిళలకు వడ్డీలేని రుణం ఇస్తున్నామన్నారు. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజి, వడ్డీ లేని రుణాలు ఇలా అన్నీ కలిపి రూ.20 కోట్లు అక్కా చెళ్లెల్లకు ఇస్తున్నామని… ఇలా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని మహిళలకు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతాల్లో మహిళా భవనాలున్నాయి. మరి హుజూరాబాద్ లో ఎందుకు నిర్మించలేదు. పదహారు గ్రామాల్లో 3 కోట్ల పది లక్షల నిధులతో అన్ని వసతులతో కూడిన మహిళా భవననాలను మంజూరు చేస్తున్నాం.
మూడు నెలల్లో ఒక్కో గ్రామంలో రూ.20లక్షల చొప్పున వెచ్చించి మహిళా భవనాలు పూర్తిచేసి ఇస్తాం. అభయ హస్తం కింద మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి, ఆ మహిళలకు 2016 రూపాయల పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. త్వరలోనే మీకు అందజేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ నిరాహార దీక్ష, మొండి పట్టుదలతో మనమంతా ఒక్కటై కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈ ఏడేళ్లలో తెలంగాణ మంచిగ చేసుకున్నాం. ఆనాడు వ్యవసాయానికి కరెంట్ ఉండేది కాదు. కాలిపోయే మోర్టార్లు, ట్రాన్స్ ఫార్మర్లు వుండేవి. కేసీఆర్ వచ్చాక ఇంటిలో 24 గంటల కరెంట్, బాయికాడ నాణ్యమైన విద్యుత్ వస్తోందిని హరీష్ అన్నారు.
లెక్కలతో సహా..
ఇక మీదట నుంచి హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యతను తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు ప్రజలకు భరోసా ఇస్తున్నారు హరీశ్ రావు. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని కోరుతున్నారు. మొదట రెండు గుంటలు రెండు వందల ఎకరాలకు పోటీ అంటూ ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ ఇప్పుడు కొత్త అస్త్రాన్ని ఎంచుకున్నారు. అభివృద్ధి విషయంలో ఈటల ఇప్పటివరకు నిర్లక్ష్యం వహించారని, దత్తత గ్రామాలకు కూడా పట్టించుకోలేదని లెక్కలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం సిద్దిపేట లెక్కలే కాకుండా ఖమ్మం జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలోని డబుల్ ఇళ్ల లెక్కలను, అభివృద్ధి పనుల వివరాలను కూడాచెబుతున్నారు మంత్రి హరీశ్.
ఇలా చేయడం వల్ల ఈటలతో పాటు బీజేపీ నేతలను సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి నెట్టాలన్నది హరీశ్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే దుబ్బాకలో బీజేపీకి కలిసి వచ్చిన అభివృద్ధిలో వెనకబడ్డాం అన్న ప్రచారం ఇక్కడ తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్ హరీష్ రావు నేడు నియోజకర్గంలో భారీ ర్యాలితో ఎంటర్ అయ్యారు. మంత్రి గంగుల కమాలాకర్ తోపాటు కొప్పుల ఈశ్వర్‌లు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే.. హరీశ్ రావు అనుసరిస్తున్న ఈ కొత్త వ్యూహం టీఆర్ఎస్ ను విజయానికి చేరువ చేస్తుందో? లేదో? అన్నది తెలియాలంటే మరి కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.