Chiranjeevi : బిగ్ ట్విస్ట్: మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ నాయకుడేనా.?
Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది ఓ ఐడీ కార్డు. అది కాంగ్రెస్ పార్టీకి చెందినది. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ఫొటోతో కూడిన కాంగ్రెస్ ఐడీ కార్డు అది. త్వరలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐడీ కార్డుల జారీ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది.. ఎవరెవరు ఓట్లేయాలన్న విషయాన్ని ఈ ఐడీ కార్డుల ద్వారా తెలియజేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పీసీసీ డెలిగేషన్ కింద చిరంజీవికి కూడా ఐడీ కార్డు కేటాయించారు. దానికి ఓ నెంబర్ కూడా ఇచ్చారు. అంటే, చిరంజీవి త్వరలో జరబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయాలన్నమాట. ఓటు వేస్తారా మరి.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ పాలనను అంతమొందించడానికి, ప్రజారాజ్యం పార్టీని పెట్టారు చిరంజీవి. అయితే, చిరంజీవి ముఖ్యమంత్రి అవలేకపోయారు. కానీ, ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ మరణం తర్వాత ఈక్వేషన్స్ మారాయి. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. ప్రజారాజ్యం ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రి కూడా అయ్యారు.
కానీ, రాజ్యసభ పదవీ కాలం ముగిశాక, పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు చిరంజీవి. రాజకీయాల్లో కోల్పోయిందే ఎక్కువని చిరంజీవి తెలుసుకున్నారు. అందుకే, తిరిగి సినిమాల్లోకి వచ్చి, రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఇన్నాళ్ళకు కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని గుర్తించింది. కాంగ్రెస్ డెలిగేషన్ కింద 2027 వరకు ఆయన్ని కాంగ్రెస్ నేతగానే గుర్తిస్తూ ఐడీ కార్డు జారీ చేశారు. ఈ దెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పాపులారిటీ పెరిగిపోతుందని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ‘చిరంజీవి మావాడే..’ అని చాలా సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చారు, చెబుతూనే వున్నారు. ఆయన మాత్రం ఏ రాజకీయ పార్టీలోనూ లేరు.