Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిన మోడీ.?
Chiranjeevi : రాజకీయం అంటే సేవ కాదు, అదిప్పుడు ఓ మ్యాజిక్. కరెన్సీ నోట్లతో ఓట్లను కొనేయడం అనేది పాత రాజకీయ విద్యే అయినా, అదిప్పుడు మరింత జోరుగా సాగుతోంది. కరెన్సీ నోటు, లిక్కర్ బాటిల్.. వీటికి అదనంగా బహుమతులు.. ఇలా ఎన్నికల పందేరంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు చాలా చాలా ఎత్తుగడలు వేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇందుకు అతీతం కాదు.
కులాలు, మతాలు, ప్రాంతాలు.. ఇలా అన్ని ప్రస్తావనలూ రాజకీయాల్లో తప్పనిసరి. అవి లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్ని ఎదుర్కోలేదు. అసలు రాజకీయాలు చేయలేదు.. వాటి ప్రస్తావన తీసుకురాకుండా.
ఇప్పుడిదంతా ఎందుకంటే, ఈ తరహా రాజకీయాలు నచ్చక మెగాస్టార్ చిరంజీవి, రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. చెప్పుకో దగ్గ స్థాయిలోనే ఓట్లు తెచ్చుకున్నారు, తనతోపాటు దాదాపు 18 మందిని అసెంబ్లీకి తీసుకెళ్ళారు చిరంజీవి. ఆ తర్వాత కపట రాజకీయాల్ని ఎదుర్కొనడం సాధ్యం కాక, చేసేది లేక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగానూ సేవలందించారు. రాజ్యసభ పదవీ కాలం ముగిశాక, పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు మెగాస్టార్. మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత చిరంజీవికి రాజకీయాల నుంచి ఓ ఆఫర్ వచ్చిందా.? అంటే, ఔననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ, మెగాస్టార్ చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానించారట. భీమవరంలో జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనే చిరంజీవి ముందు ప్రధాని మోడీ ఓ ప్రతిపాదన వుంచారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఇది కేవలం ఫేక్ ప్రచారమే అయి వుండాలి. ఎందుకంటే, రాజకీయాలు మాట్లాడేందుకు సందర్భమేంటో, సమయమేంటో ప్రధాని మోడీకి తెలుసు. చిరంజీవికి కూడా ఈ విషయమై ఖచ్చితమైన అవగాహన వుంటుంది. అయితే, చిరంజీవికి బీజేపీ వల వేయడం కొత్త విషయమేమీ కాదు. పవన్ కళ్యాణ్‌ని కాదని, లేదా పవన్ కళ్యాణ్‌తో కలిసి చిరంజీవిని బీజేపీ తనవైపుకు తిప్పుకునేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని చిరంజీవికి ప్రధాని ఆఫర్ చేశారన్నదైతే ఎందుకో చాలామందికి నమ్మబుద్ధి కావడంలేదు.